గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కితాబు
షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని వ్యాఖ్య
ఆదివాసులు, గిరిజనులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
యాదాద్రీశుని దర్శించుకున్న గవర్నర్.. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటన
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, యాదాద్రి: షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి, పేదలు, గిరిజనులు, ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు, ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మంగళవారం మూడు రోజుల రాష్ట్ర పర్యటన ప్రారంభించిన గవర్నర్.. యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మంత్రి ధనసరి సీతక్క (అనసూయ), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌ఓలు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్కను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.
రామప్ప గుడి, కోటగుళ్లు సందర్శన
ములుగు జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. రామప్ప గుడి, సరస్సును సందర్శించారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ నిర్మాణం, విశిష్టత, శాండ్ బాక్స్ టెక్నాలజీ, శిల్పసంపద రమణీయతను తెలుసుకున్నారు. రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు.
అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు గణపేశ్వరాలయాన్ని గవర్నర్ వర్మ సందర్శించారు. తర్వాత లక్నవరం చేరుకుని రాత్రిబస చేశారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ రణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. కాగా గవర్నర్ బుధ, గురువారాల్లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు.
ప్రజలు బాగుండాలని యాదాద్రీశుని కోరుకున్నా
అంతకుముందు ఉదయం రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన గవర్నర్ తొలుత యాదాద్రికి చేరుకున్నారు. విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో గవర్నర్‌కు అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
గవర్నర్ ముందుగా శ్రీస్వామివారి పుష్కరిణి వద్ద స్నాన సంకల్పం చేశారు. అఖండ జ్యోతి దీపారాధన చేసి మొక్కు టెంకాయ సమర్పించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోనికి ప్రవేశించారు. ధ్వజ స్తంభం వద్ద మొక్కిన తర్వాత అంతరాలయంలో అర్చన పూజచేశారు. దర్శనానంతరం గవర్నర్‌కు మహా మండపంలో వేద మంత్రాలతో వేదాశీ్వరచనం చేశారు.
ఆలయం కట్టడాలను పరిశీలించిన గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు స్వామి వారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామి వారి ప్రసా దాన్ని అందజేశారు. కలెక్టర్ హనుమంత్ కె.జెండగే, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన వెంట ఉన్నారు. కాగా తెలంగాణ ప్రజలు బాగుండా లని లక్ష్మీనరసింహస్వామిని కోరుకున్నానని గవ ర్నర్ దేవాలయం వెలుపల మీడియాతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment