తాజాగా మరో టెండర్ జారీ చేసిన టీజీఐఐసీ
మర్చంట్ బ్యాంకర్ ఎంపికకు షెడ్యూల్
ఈ నెల 12లోగా టెండర్ దాఖలుకు గడువు
నిధుల కోసం పరిశ్రమల భూములు కుదువ
ఎంపికైన సంస్థలకు కనీసం రూ. 5 వేల కోట్లు టార్గెట్
సాక్షి, హైదరాబాద్: మూలధన వ్యయంతో పాటు ఇతర అవసరాల కోసం రుణ మార్కెట్ నుంచి ప్రాథమికంగా రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ద్వారా రుణం తీసుకొనేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించింది. నిధుల సేకరణ బాధ్యతను రుణాలు ఇప్పించడంలో అనుభవంగల ‘మర్చంట్ బ్యాంకర్’కు అప్పగించాలని నిర్ణయించింది.
మర్చంట్ బ్యాంకర్ ఎంపికకు గత నెల 23న జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసిన టీజీఐఐసీ... తాజాగా మరో టెండర్ షెడ్యూ ల్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం ఈ నెల 12లోగా ఫైనాన్షియల్ సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. అదేరోజు సాయంత్రం సాంకేతి క బిడ్లను తెరిచి అర్హతగల సంస్థలకు సమా చారం ఇస్తారు.
2019–24 మధ్య రుణ మార్కె ట్ నుంచి రూ. 20 వేల కోట్లకుపైగా సేకరించిన సంస్థలకు ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన బిడ్డర్ కనీసం రూ. 5 వేల కోట్ల మేర నిధులు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. రుణం సేకరించి ఇచ్చే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం కమీషన్ లభించే అవకాశం ఉంది. టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ నిధుల సేకరణకు అవసరమయ్యే అన్ని రకాల అనుమతులు, క్లియరెన్సులు, లైసెన్సులు తదితరాల బాధ్యతలు చూసుకోవాలి.
రూ. 10 వేల కోట్లు సేకరణ లక్ష్యం..?
టీజీఐఐసీ ఎంపిక చేసే మర్చంట్ బ్యాంకర్ కనీసం రూ. 5 వేల కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యాన్ని టీజీఐఐసీ విధించింది. అయితే ఒకరికంటే ఎక్కువ మంది మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసి మొత్తంగా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
టీజీఐఐసీ వద్ద ఉన్న పరిశ్రమల భూముల బ్యాంకు నుంచి కోకాపేట, రాయదుర్గం ప్రాంతంలోని 400 ఎకరాలకుపైగా భూమిని కుదువ పెట్టడం ద్వారా రూ. 10 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ప్రాంతంలో ఉన్న ఈ భూముల విలువను సగటున ఎకరాకు రూ. 50 కోట్లుగా లెక్కకట్టినట్లు సమా చారం.
వీలైనంత త్వరగా నిధుల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని టీజీఐఐసీ భావిస్తోంది. రుణ మార్కెట్ నుంచి టీజీఐఐసీ రూ.10వేలు కోట్లు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘పరిశ్రమల భూములు తాకట్టు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment