టీపీసీసీలో చల్లారని సెగ!  | Growing dissatisfaction with TPCC committees Congress Party | Sakshi
Sakshi News home page

టీపీసీసీలో చల్లారని సెగ! 

Published Wed, Dec 14 2022 1:14 AM | Last Updated on Wed, Dec 14 2022 11:03 AM

Growing dissatisfaction with TPCC committees Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో అసంతృప్తుల స్వరం పెరుగుతోంది. టీపీసీసీ కమిటీలపై నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరు నేతలు చాపకింద నీరులా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుంటే, కొందరు బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరికొందరు సముచిత స్థానం దక్కలేదనే ఆవేదనతో రాజీనామాల బాట పడుతున్నారు. కొండా సురేఖ, బెల్లయ్య నాయక్, భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, గీతారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులను అనుసరిస్తూ తాజాగా మరో ముఖ్య నేత దామోదర రాజనర్సింహ అసమ్మతి గళం విప్పారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్టానం తీరుపై ధ్వజమెత్తారు.  

కాంగ్రెస్‌ కల్చరే తెలియని వాళ్లకు పదవులా? 
ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీల విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీలోని కొందరు ఎస్సీ నేతలతో సమావేశమైన ఆయన, మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కమిటీల కూర్పుపై పదునైన విమర్శలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా లేనంతమంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారని, ఇంతటి జంబో కమిటీలు అవసరమా? అని ప్రశ్నించారు.

కొత్త కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదని, పీసీసీ ప్రతినిధులను ఎన్నుకున్న నాటి నుంచి ఇది కొనసాగుతోందని చెప్పారు. కొత్త కమిటీల్లో నిన్న, మొన్న వచ్చిన వాళ్లు, కాంగ్రెస్‌ కల్చర్‌ తెలియని వారే ఉన్నారని, వారికి ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కోవర్టిజం అనే రోగం పట్టుకుందని, అధిష్టానం కూడా కోవర్టులకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు.

కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అధిష్టానం, మనోభావాలు దెబ్బతినే విధంగా పదవులు ఇచ్చిందని, కోవర్టులకే పదవులు వచ్చాయని చెప్పారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని, పార్టీలో ఎవరి ఎజెండా వారికి ఉందని అన్నారు.  
 
సంబురాలు చేసుకున్న నేతలు 
అసమ్మతి వ్యవహారం ఇలా ఉంటే తాజా కమిటీల్లో పదవులు దక్కిన నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జి.మధుసూదన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చి మాజీ ఎంపీ మల్లు రవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చి ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఆ తర్వాత మల్లు రవి, ఈరవత్రి అనిల్, నాగరిగారి ప్రీతంలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిటీల కూర్పుకు తమ మద్దతు తెలియజేశారు. మల్లు రవి మాట్లాడుతూ.. కొత్త కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 29 శాతం పదవులు ఇచ్చారని, ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ఈ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని తీర్మానించిందని, కానీ టీపీసీసీ కమిటీల్లో 60 శాతం ఇచ్చామని చెప్పారు. ఎలాంటి చిన్న తప్పిదాలు జరిగినా వాటిని సవరించుకుంటామని, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కలిసి సరి చేస్తారని వ్యాఖ్యానించారు.  

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ  
కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుకనే నేతలు మాట్లాడగలుగుతారని, దామోదర రాజనర్సింహ చెప్పిన అన్ని విషయాలను పార్టీ పరిగణనలోకి తీసుకుంటుందని, కోవర్టులు ఎవరో కూడా పరిశీలిస్తుందని మల్లు రవి చెప్పారు. నాగరి గారి ప్రీతం మాట్లాడుతూ ..తాజా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పారు. యువకులు, సీనియర్ల కాంబినేషన్‌లో కమిటీలున్నాయనేదే తమ భావన అన్నారు. త్వరలో కమిటీ విస్తరణ ఉంటుందని, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.

పోరగాళ్లకు పదవులు ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారని, వారికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అసమర్థులకు పోస్టులు ఇచ్చారని మరొకొందరు అంటున్నారని, మరి సమర్థులైన నేతలు ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఇలావుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యమివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ వెళ్లిన ‘సామాజిక కాంగ్రెస్‌’బృందం అక్కడే మకాం వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తోంది.

కమిటీలను ప్రక్షాళన చేయాలి 
కమిటీల కూర్పులో చాలా తప్పిదాలు జరిగాయని, వాటిని సవరించాలని, కమిటీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాజనర్సింహ డిమాండ్‌ చేశారు. కోవర్టులెవరో గుర్తించి కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత అధిష్టానిదేనన్నారు. అధిష్టానాన్ని గౌరవిస్తామని, అదే సమయంలో ఆత్మ గౌరవం కోసం పోరాటం కూడా చేస్తామని దామోదర స్పష్టం చేశారు.

కమిటీల నియామకంలో జరిగిన తప్పులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను బాధతో విలేకరుల సమావేశం పెట్టానని చెప్పారు. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకుని అధిష్టానం చర్యలు తీసుకోవాలని, మున్ముందు వచ్చే కష్టాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement