‘గురుకుల’ పోస్టుల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే..!  | Gurukula Board Rethinks Conduct of OMR Based Exams | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ పోస్టుల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే..! 

Published Sun, Apr 30 2023 2:23 AM | Last Updated on Sun, Apr 30 2023 2:23 AM

Gurukula Board Rethinks Conduct of OMR Based Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పునరాలోచన చేస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్‌ ఆధారితంగా లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ... ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది.

కానీ టీఎస్‌పీఎస్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షల విధానంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత (కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌–సీబీఆర్‌టీ) విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను టీఆర్‌ఈఐఆర్‌బీ పరిశీలిస్తోంది. 

పరిమిత సౌకర్యాలున్నా.... 
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలే ఉన్నాయి. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లున్నప్పటికీ ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32 వేల మందే హాజరయ్యే వీలుంది. దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్య ర్థులుండటంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని టీఆర్‌ఈఐఆర్‌బీ తొలుత భావించింది.

కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70% కొలువులున్నాయి. ఈ పోస్టుల్లో 15 సబ్జెక్టులున్నాయి. ఇవిగాకుండా జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ కేటగిరీల్లోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులున్నాయి. ఒక సబ్జెక్టు పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టును ఎంపిక చేసుకొనే అవకాశాలు తక్కువ. దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి న దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 28 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. దీంతో దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

బుకింగ్‌తో ముందుకు... 
గురుకుల పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో నిర్వహించాలంటే అందుకోసం ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాలు ఏయే తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తోంది. ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement