Gurukula Teacher posts
-
గురుకుల టీచర్లకు త్వరలో పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల నుంచి దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన సుమారు 8,500 మంది అభ్యర్థులకు అతిత్వరలో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నారు. వచ్చే నెల మొదటి వారంలో వారంతా విధుల్లో చేరే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు లభించిన వారిలో ఎక్కువ మంది ఫిబ్రవరిలో నియామక పత్రాలు పొందగా... ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మరికొందరికి నియా మక పత్రాల పంపిణీ నిలిచిపోవడం తెలిసిందే. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో పెండింగ్ అభ్యర్థులకు నియా మక పత్రాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడు రోజుల్లో వారికి నియామక పత్రాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సొసైటీ లు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నాయి. ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు ధ్రువపత్రాల పరిశీలనకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కూడా ఆ సొసైటీ పరిధిలో ధ్రువపత్రాల పరిశీ లనకు శనివారం షెడ్యూల్ జారీ చేశారు. దీంతో మైనారిటీ, జనరల్, ఎస్సీ గురుకుల సొసైటీలు కూడా షెడ్యూల్ విడుదలకు సిద్ధమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక పోస్టింగ్‌లు ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకే ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 7 నాటికి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి తెలిపారు. ఇతర గురుకుల సొసైటీలు సైతం అదే తరహా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
గురుకుల ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించినట్టుగానే గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. సాంఘిక గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునీత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రిలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ నేతతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ! -
‘గురుకుల’ పోస్టుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) పునరాలోచన చేస్తోంది. ప్రస్తుత నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్ ఆధారితంగా లేదా ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ... ఓఎంఆర్ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. కానీ టీఎస్పీఎస్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షల విధానంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు టీఎస్పీఎస్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్–సీబీఆర్టీ) విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను టీఆర్‌ఈఐఆర్‌బీ పరిశీలిస్తోంది. పరిమిత సౌకర్యాలున్నా.... కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలే ఉన్నాయి. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లున్నప్పటికీ ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32 వేల మందే హాజరయ్యే వీలుంది. దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్య ర్థులుండటంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని టీఆర్‌ఈఐఆర్‌బీ తొలుత భావించింది. కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70% కొలువులున్నాయి. ఈ పోస్టుల్లో 15 సబ్జెక్టులున్నాయి. ఇవిగాకుండా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులున్నాయి. ఒక సబ్జెక్టు పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టును ఎంపిక చేసుకొనే అవకాశాలు తక్కువ. దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి న దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 28 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. దీంతో దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బుకింగ్‌తో ముందుకు... గురుకుల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించాలంటే అందుకోసం ఆన్లైన్ టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాలు ఏయే తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తోంది. ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది. -
12 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం.. అయినా ఒక్కనోటిఫికేషన్ లేదు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మొత్తం 12 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా..ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువడక పోవడంతో, ఆయా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. తొలుత వివిధ కేటగిరిల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) తాత్సారం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీలో భాగంగా.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రకటనలు వెలువరిస్తున్నాయి. ఈ మూడు నియామక సంస్థల పరిధిలో దాదాపు 45వేల ఉద్యోగాలకు వివిధ ప్రకటనలు జారీ చేయగా..టీఆర్‌ఈఐఆర్‌బీ మాత్రం 12 వేలకు పైగా పోస్టులకు ఇప్పటికి ఒక్క ప్రకటన కూడా జారీ చేయకపోవడం గమనార్హం. ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఇందులో భాగంగా గురుకుల విద్యా సంస్థల్లో 12 వేల ఖాళీలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 9,096 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. ఆర్థిక శాఖ సైతం అన్ని రకాల ఉత్తర్వులను జారీ చేసింది. ఇదంతా జరిగి దాదాపు ఏడు నెలలు గడిచింది. కానీ టీఆర్‌ఈఐఆర్‌బీ మాత్రం ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదు. బోర్డు పరిధిలో అదనంగా వచ్చిన కొన్ని కొలువులకు అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గురుకుల విద్యా సంస్థల్లో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కాస్త ఆలస్యంగా ఆమోదం తెలిపింది. అయితే అందుకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇంకా వెలువడలేదు. ఈ అంశం ప్రస్తుతం ఆ శాఖ వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ 3 వేల కొలువులకు కూడా అనుమతులు వచ్చిన తర్వాత ఒకేసారి ప్రకటనలు జారీ చేస్తామని టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గురుకుల నియామకాల బోర్డు అధికారులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గురుకులాల్లో టీజీటీ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. దాదాపు నాలుగు నెలలుగా నోటిఫికేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. – చిట్టెల మల్లేశ్, ముజాహిద్పూర్, వికారాబాద్ జిల్లా రెండేళ్లుగా సిద్ధమవుతున్నా.. గురుకుల విద్యా సంస్థల్లో బోధన ఉద్యోగా లు, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ కొలువులకు గత రెండు సంవత్సరాలుగా సిద్ధమవుతున్నా. గురుకుల ఖాళీల విష యం తెలిసిన వెంటనే ప్రైవేటు శిక్షణ కేంద్రంలో కోచింగ్ సైతం తీసుకున్నాను. ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ ఉద్యోగాలు మొదలు ఇతర కేటగిరీల్లో పలు ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నా, బోధన రంగంలో ఉద్యోగాలకు ఎలాంటి ప్రకటనలు వెలువడటం లేదు. – మల్రెడ్డిపల్లి సుజాత, కుల్కచర్ల, వికారాబాద్ జిల్లా -
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
‘గురుకుల’ విభజనపై కొత్త చిక్కులు
సాక్షి, హైదరాబాద్ : గురుకుల విద్యాసంస్థల సొసైటీల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టుల విభజనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలుకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు పోస్టులను జోన్లు, మల్టీజోన్లు, జిల్లా కేడర్‌వారీగా విభజించాలి. ఆ తర్వాతే కొత్తగా నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్లు జారీ చేసే వీలుంటుంది. ఈ క్రమంలో పోస్టుల విభజనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా వాటిని విభజిస్తే సరిపోతుందని బోర్డు భావించినప్పటికీ ప్రభుత్వ స్పందన భిన్నంగా రావడంతో గురుకుల నియామకాల బోర్డు తలపట్టుకుంది. మీరే స్పష్టత ఇవ్వాలి... రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానం నేపథ్యంలో గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తాయా లేదా అనే అంశాన్ని తేల్చుకునేందుకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు గురుకుల సొసైటీకి వర్తిస్తాయా లేక ప్రత్యేక నిబంధనలకు లోబడి పనిచేస్తాయా చెప్పాలని కోరింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాన్ని బోర్డుకే వదిలేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా బోర్డుకు తిరుగు లేఖ రాశారు. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీంతో బోర్డు డైరెక్టర్లు తెల్లబోయారు. ప్రభుత్వమే తేల్చాల్సిన అంశాన్ని బోర్డుకు వదిలేయడంపై అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు సమయంలో బైలాస్, నియామకాల్లో పాటించిన విధానాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీ కార్యదర్శులు నిర్ణయించారు. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై ఒక దఫా చర్చలు జరిపిన కార్యదర్శులు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. -
గురుకుల ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. గురుకుల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జీవో 1274పై హైకోర్టు బుధవారం స్టే ఎత్తివేసింది. గురుకుల మహిళా కళాశాలల్లో పోస్టులన్నింటినీ మహిళలతో భర్తీ కోసం ప్రభుత్వం జీవో 1274ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జీవోను నిలిపివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జీ స్టే ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు చేయడంతో హైకోర్టు ఇవాళ స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాయిదా పడిన తేదీలను టీఎస్పీఎస్పీ త్వరలోనే ప్రకటించనుంది. -
‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు
స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన తొలగింపు సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ గురువారం తెలిపిం ది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్/ స్పోర్ట్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. బీపీఈడీ చేసిన అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. నిర్ణీత మార్కులు కలిగిన డిగ్రీతో పాటు బీపీఈడీ ఉంటే సరిపోతుంది. 40% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్/3 ఏళ్ల బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించింది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిగ్రీ అభ్యర్థులకు నిర్ణీత విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్/గేమ్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధననూ తొలగించింది. క్రాఫ్ట్ టీచర్ పోస్టుల్లో నిర్ణీత విభాగాల్లో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) చేసిన వారికి, ఆర్ట్ టైలరింగ్ ఎంబ్రాయిడరీలో వొకేషనల్ ఇంటర్మీడియెట్ చేసిన వారికి, టీసీసీ లోయర్ చేసిన వారికి అవకాశం కల్పించింది. పోస్టులన్నింటికి 1999 జూలై 1 తర్వాత పుట్టినవారు, జనరల్ అభ్యర్థులు 1973 జూలై 2కు ముందు జన్మించిన వారు అర్హులు కాదు. తెలుగు, హిందీ, ఉర్దూ టీజీటీ, పీజీటీ పోస్టుల స్క్రీనింగ్ టెస్టు తేదీలను తర్వాత ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది.