హైదరాబాద్‌లో కుండపోత.. | Heavy Rain In Telangana | Sakshi
Sakshi News home page

జనజీవనం అస్తవ్యస్తం 

Published Thu, Sep 17 2020 3:18 AM | Last Updated on Thu, Sep 17 2020 11:37 AM

Heavy Rain In Telangana - Sakshi

అమీర్‌పేటలో జలమయమైన రహదారి

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, జలదిగ్బంధంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో అత్యధికంగా 22.06 సెం.మీ. వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో పత్తి, వరి, కంది పంటలు నీటమునిగాయి. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలోగోడ కూలి ముగ్గురు, హైదరాబాద్‌ పీర్జాదిగూడలో ఆలయ ప్రహరీ కూలి ఇద్దరు మృతిచెందారు. 

పలు గ్రామాలు జలదిగ్బంధం..
మద్నూర్‌/నిజాంసాగర్‌(జుక్కల్‌): మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో దిగువన ఉన్న కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల చుట్టూ వరద చేరడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బుధవారం మద్నూర్‌ మండలంలోని ఎన్‌ బుర, కుర్లా, దోతి, గోజేగావ్, సిర్‌పూర్, ఇలేగావ్‌ గ్రామాల చూట్టు వరద నీరు చేరిందని గ్రామస్తులు తెలిపారు. వరద నీరు ఇంట్లోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గ్రామాల్లోని సిబ్బందితో ఫోన్‌ లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిచ్కుంద మండలంలోని మెక్క, మిషన్‌ కల్లాలి, ఖద్గాం గ్రామాల చుట్టూ వరద నీరు చేరడంతో జలదిబ్బంధంలో ఉన్నాయి. అంతేగాకుండా శెట్లూర్, నాగుల్‌గావ్, లొంగన్, రాజుల్లా తదితర గ్రామాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. భారీ వర్షాలతో మంజీర పరీవాహక ప్రాంతాలైన మదన్‌ హిప్పర్గా, కుర్లా, ఎన్‌ బుర, ఇలేగావ్, సిర్‌పూర్‌ గ్రామ శివారులోని సుమారు వెయ్యి ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు పేర్కొన్నారు. 

బుధవారం భారీ వర్షాలకు జలమయమైన వనపర్తి పట్టణంలోని మారెమ్మకుంట కాలనీ

పొలానికి వెళ్లి.. వాగు దాటలేక...
అచ్చంపేట రూరల్‌: ఉదయం డిండి వాగు దాటి పొలానికి వెళ్లిన ఆ భార్యాభర్తలు.. సాయంత్రానికి వాగు ఉధృతి పెరగడంతో ఇంటికి చేరుకోలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం చీన్యతండాకు చెందిన సబావత్‌ బుజ్జి, వెంకట్‌రాం దంపతులు బుధవారం ఉదయం డిండి వాగు సమీపంలోని తమ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి తండాకు రావడానికి సిద్ధమయ్యారు. అప్పటికే వాగు ఉధృతి పెరగడంతో అక్కడే ఉండి గట్టిగా కేకలు వేశారు. సమీప పొలాల రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. సీఎం కేసీఆర్, సీఎస్‌కు పరిస్థితిని వివరించి హెలికాఫ్టర్‌ పంపాలని కోరారు. అయితే చీకటి పడటంతో అది వస్తుందా? రాదా? అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. కలెక్టర్‌ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్‌ అక్కడికి చేరుకుని వాగు అవతల ఉన్న భార్యాభర్తలతో మాట్లాడటానికి యత్నించగా వారి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. అయితే ఎట్టి పరిస్థితిల్లోనూ బాధితులను కాపాడతాని వారు వెల్లడించారు.

పొంగిపొర్లుతున్న చెరువులు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక చోట్ల వాగులు వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో అత్యధికంగా 22.06 సెం.మీ. వర్షం కురిసింది. తాడూరులో 15.8 సెం.మీ, నాగర్‌కర్నూల్‌ 15.6 సెం.మీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో చాలా చెరువులు అలుగుపారుతున్నాయి. 

ముగ్గురి మృతి...
వర్షాలతో ఇంటి గోడలు కూలి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడలో మట్టి మిద్దె కూలి గౌతం (3), మరికల్‌ మండలంలోని కన్మనూర్‌లో గోడకూలి అనంతమ్మ (68), నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడిక్యాలలో సంకె దేవమ్మ (65) మృతి చెందారు. వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాటి పరిధిలో ఉన్న జూరాల, భీమా, కేఎల్‌ఐ పంట కాల్వలకు గండ్లు పడి నీరు పంట పొలాల్లోకి చేరింది. 

నిలిచిన రాకపోకలు...
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు ధ్వంసమైన ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. నర్వ మండలం కొత్తపల్లి గజ్జలమ్మ వాగు ఉధృతంగా పారుతుండటంతో ఆ ప్రాంతం నుంచి ప్రయాణించకుండా అధికారులు అక్కడ ముళ్లకంచె వేశారు. ఇక వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వనపర్తి జిల్లాలో వరి, కంది, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 4,636 ఎకరాల్లో పంట నీటమునిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1,400 ఎకరాల్లో.. నారాయణపేట జిల్లాలో 6000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో çపంటను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, అధికారులు నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో 08540–230201, నారాయణపేట కలెక్టరేట్‌లో 08506–282282, 282369 హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు.

కొట్టుకుపోయిన బైక్‌లు.. యువకులు క్షేమం 
 తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు మత్తడి నీటి ప్రవాహంలో రెండు మోటార్‌ సైకిళ్లు కొట్టుకుపోయాయి. వాటిపై ఉన్న గంధమల్ల చెందిన శాగర్ల మధు, బొత్త మహేశ్, శాగర్ల వెంకటేశ్‌లను స్థానికులు రక్షించారు. ముగ్గురు యువకులు రెండు బైక్‌లపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్, మహేశ్‌కు స్వల్పగాయలయ్యాయి. 

పిల్లలను కాపాడబోయి.. వరద కొట్టుకుపోయిన తల్లి 
మర్పల్లి: వరదనీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయి ఓ తల్లి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలోని శాపూర్‌లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెనావత్‌ దశరథ్, భార్య అనిత.. తమ ముగ్గురు పిల్లలతో పాటు మరో 5 మంది కూలీలతో పత్తి పంటలో కలుపు తీసేందుకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఆటోలు ఇంటి వచ్చే దారిలో శాపూర్‌తండా సమీపంలో ఉన్న కల్వర్టుపై నుంచి భారీ వరద పారుతోంది. దశరథ్, అనిత(42)తో పాటు ముగ్గురు పిల్లలను పట్టుకుని కల్వర్టు దాటే ప్రయత్నం చేశారు. ఇద్దరు పిల్లలు వారి చేతుల నుంచి తప్పి వరదలో కొట్టుకుపోతున్నారు. ఇది చూసిన అనిత పిల్లలను కాపాడేందుకు వరద నీటిలో వెంబడించింది. కొద్ది దూరం వరకు వెళ్లిన పిల్లలు ఓ చెట్టు కొమ్మలను పట్టుకొని అక్కడే నిలిచారు. అనిత మాత్రం వరద ఉధృతిలో అర కిలోమీటరు దూరం కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది. 

వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల భవనం 

హైదరాబాద్‌లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్‌ పీర్జాదిగూడలో ఓ దేవాలయం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. విష్ణుపురి కాలనీకి చెందిన గ్లాస్‌కట్టర్‌ వర్కర్‌ జి.ప్రవీణ్‌(41), మోహన్‌ (15)లుగా వీరిని గుర్తించారు. వీరిద్దరూ ద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో గోడ కూలి వీరిపై పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో వరద చేరడంతో అనేక వాహనాలు    నీట మునిగాయి. ప్రధాన రహదారులు సహా కాలనీల్లో భారీగా వరద నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. పలు చోట్ల స్తంభాలు నేలకూలాయి.

సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్యన చాలా ప్రాంతాల్లో ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. జుపార్క్, షేక్‌పేట వద్ద అత్యధికంగా 10.9 సెంటిమీ టర్ల జడివాన కురిసింది. ఈసీఐఎల్‌–ఏఎస్‌రావునగర్‌ ప్రధాన రహదారిలో రోడ్డు కుంగి గొయ్యి ఏర్పడింది. రాయదుర్గంలోని మల్కంచెరువు నుంచి వచ్చే వరదనీటి కాలువ తెగిపోవడంతో రోడ్లపై భారీ వరదనీరు పారింది. లోతట్టు ప్రాంతమైన బాలాజీనగర్‌లోని పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. గండిపేట్‌ కాండ్యూట్‌ కాలువను ఆనుకుని ఇండ్లల్లో వర్షపు నీరు చేరింది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

మణికొండలో నీటమునిగిన కార్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement