సాక్షి, మహబూబ్‌నగర్ : భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు సురక్షితంగా బయటపడగా మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహయక చర్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతుల మడుగు-గోపన్నపల్లి మధ్య కాజేవేపై దాటడానికి ప్రయత్నం చేస్తుండగా నీటి ప్రవాహానికి ఆటో కొట్టుకు పోయింది. ఆటోను ట్రాక్టర్ ద్వారా లాగడానికి ప్రయత్నించే క్రమంలో తాడు తెగటంతో ఆటో కిలోమీటర్ వరకు కొట్టుకు పోయింది. అంత దూరంలో నుంచి ఈదుకుంటూ డ్రైవర్ కనిమోని ఊశన్న బయటకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ఊశన్న సురక్షితంగా బయట పడటంతో స్దానికులు ఊపిరి పీల్చుకున్నారు. (వాగులో ఒరిగిన ఆర్టీసీ బస్సు..)
నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం బైరాపుర్‌లో బైక్ వెళ్తూ వాగులో కొట్టుకుపోతున్న యువకున్ని స్థానికులు కాపాడారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి వద్ద వాగులో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలు కొట్టుపోయారు. స్ధానికులు వారిని కాపాడారు. భార్యాభర్తలు మేస్త్రీ పనులు చేసుకు నేందుకు పెద్దకొత్తపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం కౌకుంట్ల వాగులో చేపల వేటకు వెళ్లి వెంకటేష్ వరద ఉదృతి పెరగటంతో వాగులో చిక్కుకున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు అతన్ని కాపాడారు. ఉట్కూర్ మండలం పడిగిమారి వద్ద చీకటివాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో గొర్రెల కాపరి బాలురాజ్ గల్లంతయ్యాడు. అతన్ని స్ధానికులు రక్షించారు. మొత్తంగా భారీ వరదల సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైన అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. (ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment