సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావొచ్చని, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు 5.43 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 10 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
వాంకిడిలో రికార్డు వర్షపాతం
కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 371 మిల్లీమీటర్లు వర్షపాతం నమెదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment