సాక్షి, సిటీబ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో వరుసగా నాలుగోరోజైన శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం నిండా మునిగింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన జడివానకు రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వినాయక నిమజ్జనానికి స్వల్పంగా అంతరాయం కలిగింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నగరానికి ఆనుకొని ఉన్న జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరద నీరు పోటెత్తుతుండడంతో..జలమండలి అధికారులు రెండు జలాశయాలకు రెండు గేట్ల చొప్పున తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఉ స్మాన్‌సాగర్‌లోకి 500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..442 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు.
హిమాయత్‌సాగర్‌లోకి 600 క్యూసెక్కుల వరద చేరగా.. 678 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. దీంతో మూసీలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో బాపూఘాట్–ప్రతాపసింగారం(44 కి.మీ)మార్గంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, బల్దియా యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. పోలీసు విభాగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా రాగల 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం రాత్రి 10 గంటల వరకు నగరంలో నమోదైన వర్షపాతం వివరాలివీ.. (సెంటీమీటర్లలో)
రాజేంద్రనగర్ 8.75, శివరాంపల్లి 6.6, గోల్కొండ 5.1, చాంద్రాయణగుట్ట 2.58, కిషన్‌భాగ్ 2.4, అత్తాపూర్ 2.33, జూపార్క్2.1
చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ
Comments
Please login to add a commentAdd a comment