సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ఎడతెరిపిలేని వానలతో వాగులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ నీళ్లన్నీ చేరుతుండటంతో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ కృష్ణానదిలో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 78,390 క్యూసెక్కులకు వరద వస్తోంది. ఒక్క రోజులో 7.14 టీఎంసీల వరద చేరడంతో.. నీటి నిల్వ 72.89 టీఎంసీలకు పెరిగింది. మూడు నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న జూరాలకు 1,725 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 7.097 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేస్తామని, అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలుకానుంది. ఇక మంజీరాలో పెద్దగా ప్రవాహాలు మొదలుకాలేదు. సింగూరు డ్యామ్‌కు 1,884 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యామ్ సామర్థ్యం 29.9 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 19.41 టీఎంసీల నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద మొదలైంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదావరికి వరద షురూ..
గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వానలు పడుతుండటంతో నదిలో ప్రవాహాలు పెరిగాయి. ఎగువన శ్రీరాంసాగర్‌కు శనివారం సాయంత్రానికి 1.25 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ఇక ప్రాణహిత ఉప్పొంగుతుండటంతో దిగువ గోదావరికి భారీ వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3,85,100 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గేట్లు ఎత్తి 4,27,930 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆ నీళ్లన్నీ దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజీ మీదుగా దిగువకు వెళ్లిపోతున్నాయి.
నిండుకుండల్లా.. చిన్న రిజర్వాయర్లు
►నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు.
►ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు, కుమురం భీం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరుకున్నాయి.
►ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment