tungabadra river
-
‘తుంగభద్ర’ కలుషితం .. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం!
సాక్షి, అమరావతి : తుంగే పానే.. గంగే స్నానే అన్నది ఆర్యోక్తి. గంగా నదిలో స్నానంచేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర నీటిని తాగితే అంతే పుణ్యం వస్తుందన్నది దీని అర్థం. కానీ.. ఇప్పుడు తుంగభద్ర నదీ జలాలను శుద్ధిచేయకుండా నేరుగా తాగితే పుణ్యం మాట ఏమోగానీ వ్యాధుల బారినపడే ప్రమాదం అధికంగా ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక తేల్చిచెబుతోంది. కర్ణాటక పరిధిలో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడంవల్ల నదీ జలాలు కలుషితమయ్యాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాములలోపు ఉండాలి. కానీ.. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 6.2 మిల్లీగ్రాములు ఉండటాన్ని బట్టి చూస్తే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం, బావపురం మధ్య తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీ గ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీ గ్రాములు ఉండటం గమనార్హం. నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికి.. కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర మరోవైపు జని్మంచి.. 147 కి.మీ. దూరం తుంగ నది, 171 కి.మీ. దూరం భద్ర నది పయనించాక కూడలి వద్ద రెండు నదులూ సంగమించి.. ఒకటిగా 547 కి.మీ. దూరం ప్రవహించి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్కు సమీపంలో గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నిజానికి... కృష్ణాకు ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నది పరిసర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంవల్ల కాలుష్య కాసారంగా మారింది. గతేడాది నవంబర్‌లో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి నవంబర్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. - కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు సీడబ్ల్యూసీ–సీపీసీబీ తేల్చాయి. - కర్ణాటక పరిధిలోని భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకూ భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు అవి గుర్తించాయి. - తుంగ, భద్ర కలిసి తుంగభద్రగా రూపాంతరం చెందే ప్రాంతం కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకూ నదీ జలాల్లో లీటర్ నీటికి బీఓడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది. - కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన ఈ జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీగ్రాములు ఉంది. - తుంగభద్ర నదిలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధిచేశాకే నదిలోకి వదలాలని కేంద్రానికి సీడబ్ల్యూసీ–సీపీసీబీ నివేదిక ఇచ్చింది. -
నదులకు జల కళ!
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఎడతెరిపిలేని వానలతో వాగులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. ఆ నీళ్లన్నీ చేరుతుండటంతో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ కృష్ణానదిలో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి 78,390 క్యూసెక్కులకు వరద వస్తోంది. ఒక్క రోజులో 7.14 టీఎంసీల వరద చేరడంతో.. నీటి నిల్వ 72.89 టీఎంసీలకు పెరిగింది. మూడు నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా నిండి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న జూరాలకు 1,725 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 7.097 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక తుంగభద్ర జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ఏ సమయంలోనైనా నీటిని విడుదల చేస్తామని, అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో తుంగభద్ర నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద మొదలుకానుంది. ఇక మంజీరాలో పెద్దగా ప్రవాహాలు మొదలుకాలేదు. సింగూరు డ్యామ్‌కు 1,884 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యామ్ సామర్థ్యం 29.9 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 19.41 టీఎంసీల నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద మొదలైంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరికి వరద షురూ.. గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వానలు పడుతుండటంతో నదిలో ప్రవాహాలు పెరిగాయి. ఎగువన శ్రీరాంసాగర్‌కు శనివారం సాయంత్రానికి 1.25 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ప్రాజెక్టులోకి 3 టీఎంసీల నీరు చేరింది. ఇక ప్రాణహిత ఉప్పొంగుతుండటంతో దిగువ గోదావరికి భారీ వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3,85,100 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గేట్లు ఎత్తి 4,27,930 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆ నీళ్లన్నీ దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజీ మీదుగా దిగువకు వెళ్లిపోతున్నాయి. నిండుకుండల్లా.. చిన్న రిజర్వాయర్లు ►నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు 50 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు. ►ఆసిఫాబాద్ జిల్లాలో వట్టివాగు, కుమురం భీం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరుకున్నాయి. ►ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ జలకళ సంతరించుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. -
తుంగభద్ర నది పుష్కరాలపై స్పష్టత ఏదీ?
సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): తుంగభద్ర నది పుష్కరాలు ఈ ఏడాది నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించే ఏకైక ప్రాంతం ఒక్క అలంపూర్ నియోజక వర్గం మాత్రమే. సమయం సమీపిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం నేటి దాక పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగడంలేదు. ఒక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు అడపా దడపా వస్తూ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించడంతోనే సమయం సరిపోతుంది. ఇది తప్పా ప్రభుత్వం మాత్రం పుష్కరాల విషయంలో నేటి దాక ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఇప్పటికే పుష్కరాలపై పలు దఫాలు సమావేశాలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతులను కలవడం, పుష్కరఘాట్లను గుర్తించడం వంటి పనులు చకచకా జరిగిపోతుండగా.. రాష్ట్రంలో మాత్రం నేటిదాక పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా..? లేదా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వానికి మంత్రాలయ పీఠాధిపతి లేఖ రాసినా స్పందన కనిపించలేదు. బాధ్యత ఒక్క శాఖదేనా.. పుష్కరాలంటే దేవాదాయశాఖ మాత్రమేనా అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరింస్తుదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుష్కరాలకు వస్తారని, కనీసం 50శాతమైన భక్తు లు వస్తారని బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, వాహనాల పార్కింగ్, నదీ తీరంలో పిండ ప్రదానాలకు షెడ్లు, రహదారుల విస్తరణ, విద్యుత్ అలంకరణ, తాగునీరు ఇలా ఎన్నో పనులు చేపట్టాల్సి వస్తుంది. జోగుళాంబ ఆలయం సమీపంలో ముందే ఇరుకైన స్థలం ఉండడం, దీనికి తోడు రహదారులకు ఇరువైపులా ఆక్రమణకు గురికావడం, ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే అనేక వ్యాపార దుకాణాలతో కబ్జాకు గురయ్యాయి. చిత్తశుద్ధి కరువు సీఎం కేసీఆర్ తన భక్తి ప్రపత్తులను కేవలం యాదాద్రి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారని.. జోగుళాంబ ఆలయం, తుంగభద్ర నది పుష్కరాలపై చిత్తశుద్ధి కరువైందని స్థానికులు ఆరోపిస్తు న్నారు. జోగుళాంబ సేవాసమితి వారు ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరేందుకు బీజేపి, కాంగ్రెస్ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమాయత్తం కానున్నారు. సీఎం దృష్టి సారించాలి రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన అలంపూర్‌లో త్వరలో ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. సీఎం కేసీఆర్‌కు యాదాద్రి తప్పా జోగుళాంబ అమ్మవారు కనిపించడంలేదు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ పుష్కరాలు సరైన సమయం. ఈ విషయంలో సీఎం ఇప్పటికైన దృష్టి సారించాలి. – డీకే అరుణ, మాజీ మంత్రి, గద్వాల నాటి హామీలే నేరవేర్చలేదు 2016లో జరిగిన కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం అప్పట్లో అలంపూర్ అభివృద్ధిపై ఇచ్చిన హామీలే నేటికీ నెరవేర్చలేదు. ఇక తుంగభద్ర పుష్కరాలు కనీసం నిర్వహిస్తారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వంలో ప్రజలే కాక జోగుళాంబ అమ్మవారు కూడా ఇబ్బందులు పడాలేమో. – సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ పుష్కరాలు నిర్వహించాలి తుంగభద్ర నది పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఈ విషయంలో సీఎం చొరవ చూపాలి. అనేక సమావేశాలలో సీఎం నోట అలంపూర్ మాట వినిపించింది. ఇప్పుడు పుష్కరాలపై కూడా ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి. – బీవీ.బాబు, జోగుళాంబ సేవాసమితి ఉపాధ్యక్షుడు ఏర్పాట్లపై త్వరలో సమావేశం తుంగభద్ర నది పుష్కరాల విషయమై ఈ రెండు రోజుల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందనే బావిస్తున్నాం. – ప్రేమ్‌కుమార్, ఈఓ, జోగుళాంబ ఆలయం -
మూడు నదుల ముప్పు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. భీమా దూకుడు ప్రదర్శిస్తోంది. వీటికి తుంగభద్ర కూడా తోడయ్యింది. ఈ మూడు ఒక్కటై ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముప్పేట దాడికి దిగాయి. ఇప్పటికే నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల్లో కృష్ణానది బీభత్సం సృష్టించింది. వరద ముప్పు 10 వేలకు పైగా ఎకరాలను ముంచెత్తింది. 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కృష్ణ మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబం ధాలు తెగిపోయాయి. అధికారులు 38 గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపూర్ శివారులోని చేపల చెరువుకు కృష్ణమ్మ పోటెత్తడంతో చెరువు నిర్వాహకుడు వర దలో చిక్కుకుపోయాడు. అధికారులు నాటుపడవ మీద అతన్ని ఒడ్డుకు చేర్చారు. పరీవాహక గ్రామాల్లో ముం పును ఎదుర్కొనేందుకు.. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని పల్లెల్లో మోహరించారు. వీరు గ్రామాల్లో తిరుగుతూ వరద ఉధృతిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇటు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తమ పరిధిలో ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తిరిగి నీటమునిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మక్తల్ మండలం పస్పుల వద్ద దత్త క్షేత్రంలోకి వచ్చిన వరద నీరు పదేళ్ల క్రితం పరిస్థితి పునరావృతం! పదేళ్ల తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇంత భారీమొత్తంలో ఇన్‌ఫ్లో వచ్చింది. 2009 అక్టోబర్ 3న 10.19 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ 8.54 లక్షల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 63 క్రస్టు గేట్లలో 62 గేట్లను ఎత్తేశారు. 11 గ్రామాలకు ముప్పు.. అలంపూర్ గొందిమల్లంలో ఉన్న కృష్ణ, తుంగభద్ర సంగమం వద్ద రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలైన ఉండవెల్లి మండలం పుల్లూరు, కలకోట్ల, మిన్నిపాడు, అలంపూర్ మండలంలో అలంపూర్, సింగవరం, మానవపాడు మండలం కొరివిపాడు, మద్దూరు, రాజోలి మండలంలో రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, అయిజ మండల పరిధిలోని పుట్కనూరు, రాజాపురం, వేణిసోంపూర్ గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పంట నీటమునక.. గద్వాల మండలం రేకులపల్లి గ్రామశివారులో లోయర్ జూరాల కారణంగా 200 ఎకరాల పండ్ల తోటలు, పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. ధరూరు మండలం భీంపురానికి చెందిన 150 ఎకరాలలో వరి, పత్తి పంటలు మునిగాయి. ఇటిక్యాల మండలం వీరాపురం, కార్పాకుల, తిమ్మాపురం గ్రామాల్లో 850 ఎకరాల్లో వరి, చెరకు, పత్తి, మిరప, ఉల్లి పంటలు మునిగాయి. పెబ్బేరు మండలం రాంపురం, రంగాపూర్, మునగమాన్‌దిన్నె, పెంచికల పాడు, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి, కంది, వేరుశనగ, పంటలతో పాటు వరినారుమడులు నీట మునిగాయి. అమరచింత మండలం నందిమల్లలో 50 ఎకరాల వరి పంట నీట ముని గింది. ఆత్మకూరు మండలంలోని రేచింతల, ఆరేపల్లి, మాలమల్ల, కత్తెపల్లి, తూంపల్లి, జూరాలలో 200 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. నారాయణపేట జిల్లా కృష్ణా పరీవాహక మండలాల్లో 4 వేలకు పైగా వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కృష్ణ, మాగనూరు మండలాల పరిధిలోని వాసునగర్, హిందూపూర్, మొరహరిదొడ్ది, ముడుమాలు, తంగిడి, పుంజనూరు, మందిపల్లి, కొల్పూరు, గుడెబల్లూరులో 5 వేల ఎకరాల్లో పంట మునిగింది. స్తంభించిన రవాణా.. కృష్ణ మండల కేంద్రంతో పాటు, వాసునగర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణ, హిందూపూర్ మధ్యనున్న వంతెన మునిగిపోవడంతో మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హిందూపూర్‌లోని పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ–గద్వాల జిల్లా ధరూరు మండలంలో చింతరేవుల–భీంపురం అదే మండలం బీరోలు, గుర్రంగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. ఆత్మకూరు మండలంలోని రేచింతలకు రాకపోకలు నిలిచాయి. కృష్ణ మండలం తంగిడిలోని శ్రీదత్తభీమేశ్వర ఆలయాన్ని నీరు చుట్టు ముట్టింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద శివాలయం, రామాలయంలోకి వరద చేరింది. మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ వద్ద ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలోకి వరద వచ్చింది. వరద ముప్పుతో నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహాయక చర్యలు చేపడుతున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్లు.. గద్వాల కలెక్టరేట్లో 08546–274007, నారాయణపేట కలెక్టరేట్లో 08506–283444 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
పోలవరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద శుక్రవారం గోదావరి నది ఉధృతి పెరిగింది. కాడెమ్మ స్లయిజ్పై మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. ఇదే సమయంలో ప్రాజెక్టు సందర్శనకు వచ్చి 12 బస్సులు చిక్కుకున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన 3 అడుగుల మేర కంకర రోడ్డు నిర్మాణం చేసి బస్సులను బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర తుంగభద్ర నది శుక్రవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం గుండ్రేవుల గ్రామంలో పంటపొలాలలోకి వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీట మునిగిన పంటపొలాలను కొడుమూరు వైఎస్సార్సీపీ ఇంచార్జి మురళి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. -
అధికార దర్పం.. ప్రజలకు శాపం
జిల్లాలో అధికార పార్టీ నాయకుల స్వార్థం పెచ్చుమీరుతోంది. ప్రజా ప్రయోజనాలను సైతం పణంగా పెట్టి తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఓ నేత ఏకంగా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు గండికొట్టి తన పొలానికి నీళ్లు మళ్లించుకోగా...ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన నాయకుడు కూడా అదే పని చేస్తున్నారు. ఈయన ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన ఎస్ఎస్ ట్యాంకు నుంచే నీటిని మళ్లించుకుంటుండడం గమనార్హం. టాస్క్‌ఫోర్స్ (కర్నూలు): ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి అధికార పార్టీ నాయకుడు. ఆదోని మార్కెట్‌యార్డు చైర్మన్‌గానూ పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మీనాక్షినాయుడు ప్రధాన అనుచరులలో ఒకరు. ఈయన గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంకు నీటిని తన పొలానికి అక్రమంగా మళ్లించుకుని పంటలు పండిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే పని చేశారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు గ్రామానికి కొంత దూరంలో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించారు. దీనికి తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఓవర్‌హెడ్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఆర్)కు పంపింగ్ చేసి.. గ్రామానికి సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఆరు వేలకు పైగా జనాభా ఉంది. ఎస్ఎస్ ట్యాంకు నీరు చాలడం లేదు. వేసవిలో సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపు అన్ని కాలాల్లోనూ నీరు చాలక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం మరో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆ దిశగా చర్యలు చేపట్టే నాథులే కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో తమ గ్రామ నాయకుడే ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీటిని అక్రమంగా మళ్లించుకుని.. తాగునీటి సమస్యను మరింత జటిలం చేయడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్ఎస్ ట్యాంకు దిగువన ఆయనకు 20 ఎకరాలకు పైగా పొలం ఉంది. ట్యాంకు నుంచి నీటిని అక్రమంగా మళ్లించుకోవడానికి గట్టు పక్కనే పంపింగ్ మోటారు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల గాలి పైపులు, గట్టును తవ్వి పైపులు వేసుకున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రోజూ ఎల్లెల్సీ నుంచి ఎస్ఎస్ ట్యాంకుకు పంపింగ్ చేస్తున్నా.. నీటిమట్టం మాత్రం పెరగడం లేదు. అధికార పార్టీ నేత అక్రమంగా మళ్లించుకుంటుండడమే ఇందుకు కారణం. ఏ కారణం వల్లనైనా కాలువలో నీటి సరఫరా నిలిచిపోతే గ్రామంలో సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గండి పడే ప్రమాదం ఎస్ఎస్ ట్యాంకు గట్టును అక్కడక్కడ తవ్వడం వల్ల అది బలహీనమై గండి పడే ప్రమాదం లేకపోలేదు. తాగునీటిని సాగుకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. ఇది నేరం కూడా. అయినప్పటికీ అధికార పార్టీ నేత బహిరంగంగానే నీటిని అక్రమంగా మళ్లించుకుని వరి పంట సాగు చేస్తున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్, ఎల్లెల్సీ అధికారులు నోరుమెదపడం లేదు. తమ సమస్యలు, కష్టాలను తీర్చాల్సిన అధికార పార్టీ నాయకుడే ఇలాంటి చర్యలకు పాల్పడితే తామేమి అనగలమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అక్రమాలపై బహిరంగంగా మాట్లాడడానికి సైతం జంకుతున్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువలో స్నానానికి దిగి గల్లంతైన మద్దిలేటి(35) అనే వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం 6 గంటలకు లభ్యమైంది. కొడుమూరు కర్నూలు బ్రాంచి కెనాల్ వద్ద మృతదేహన్ని కనుగొన్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి తన స్నేహితులతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో పార్టీ చేసుకున్నాడు. అనంతరం స్నానం చేద్దామని కాలువలోకి దిగగా..ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. స్నేహితులంతా కలిసి నిన్నటి నుంచి వెతకటం ప్రారంభించటంతో సోమవారం ఉదయం అతని శవం బయటపడింది.