మదిర ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి టీడీపీ నేత అక్రమంగా వేసిన పైపులు (ఇన్‌సెట్) నీటి పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన మోటారు
జిల్లాలో అధికార పార్టీ నాయకుల స్వార్థం పెచ్చుమీరుతోంది. ప్రజా ప్రయోజనాలను సైతం పణంగా పెట్టి తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఓ నేత ఏకంగా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు గండికొట్టి తన పొలానికి నీళ్లు మళ్లించుకోగా...ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన నాయకుడు కూడా అదే పని చేస్తున్నారు. ఈయన ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన ఎస్‌ఎస్ ట్యాంకు నుంచే నీటిని మళ్లించుకుంటుండడం గమనార్హం.
టాస్క్‌ఫోర్స్ (కర్నూలు): ఆదోని మండలం మదిర గ్రామానికి చెందిన భాస్కరరెడ్డి అధికార పార్టీ నాయకుడు. ఆదోని మార్కెట్‌యార్డు చైర్మన్‌గానూ పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడు ప్రధాన అనుచరులలో ఒకరు. ఈయన గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్) ట్యాంకు నీటిని తన పొలానికి అక్రమంగా మళ్లించుకుని పంటలు పండిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే పని చేశారు. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు గ్రామానికి కొంత దూరంలో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మించారు.
దీనికి తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఓవర్‌హెడ్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఆర్)కు పంపింగ్ చేసి.. గ్రామానికి సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఆరు వేలకు పైగా జనాభా ఉంది. ఎస్‌ఎస్ ట్యాంకు నీరు చాలడం లేదు. వేసవిలో సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపు అన్ని కాలాల్లోనూ నీరు చాలక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం మరో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆ దిశగా చర్యలు చేపట్టే నాథులే కరువయ్యారు.
ఇలాంటి పరిస్థితిలో తమ గ్రామ నాయకుడే ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి నీటిని అక్రమంగా మళ్లించుకుని.. తాగునీటి సమస్యను మరింత జటిలం చేయడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్‌ఎస్ ట్యాంకు దిగువన ఆయనకు 20 ఎకరాలకు పైగా పొలం ఉంది. ట్యాంకు నుంచి నీటిని అక్రమంగా మళ్లించుకోవడానికి గట్టు పక్కనే పంపింగ్ మోటారు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల గాలి పైపులు, గట్టును తవ్వి పైపులు వేసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రోజూ ఎల్లెల్సీ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకుకు పంపింగ్ చేస్తున్నా.. నీటిమట్టం మాత్రం పెరగడం లేదు. అధికార పార్టీ నేత అక్రమంగా మళ్లించుకుంటుండడమే ఇందుకు కారణం. ఏ కారణం వల్లనైనా కాలువలో నీటి సరఫరా నిలిచిపోతే గ్రామంలో సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గండి పడే ప్రమాదం
ఎస్‌ఎస్ ట్యాంకు గట్టును అక్కడక్కడ తవ్వడం వల్ల అది బలహీనమై గండి పడే ప్రమాదం లేకపోలేదు. తాగునీటిని సాగుకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. ఇది నేరం కూడా. అయినప్పటికీ అధికార పార్టీ నేత బహిరంగంగానే నీటిని అక్రమంగా మళ్లించుకుని వరి పంట సాగు చేస్తున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్, ఎల్లెల్సీ అధికారులు నోరుమెదపడం లేదు. తమ సమస్యలు, కష్టాలను తీర్చాల్సిన అధికార పార్టీ నాయకుడే ఇలాంటి చర్యలకు పాల్పడితే తామేమి అనగలమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అక్రమాలపై బహిరంగంగా మాట్లాడడానికి సైతం జంకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment