తుంగభద్ర నది పుష్కరాలపై స్పష్టత ఏదీ?  | Tungabhadra Pushkar Arrangements Not Yet Completed | Sakshi
Sakshi News home page

తుంగభద్ర నది పుష్కరాలపై స్పష్టత ఏదీ? 

Published Tue, Sep 15 2020 1:04 PM | Last Updated on Tue, Sep 15 2020 1:04 PM

Tungabhadra Pushkar Arrangements Not Yet Completed - Sakshi

అలంపూర్‌లో మరమ్మతుకు నోచుకోని పుష్కరఘాట్‌

సాక్షి, జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్‌): తుంగభద్ర నది పుష్కరాలు ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించే ఏకైక ప్రాంతం ఒక్క అలంపూర్‌ నియోజక వర్గం మాత్రమే. సమయం సమీపిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం నేటి దాక పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగడంలేదు. ఒక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అడపా దడపా వస్తూ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను గుర్తించడంతోనే సమయం సరిపోతుంది.

ఇది తప్పా ప్రభుత్వం మాత్రం పుష్కరాల విషయంలో నేటి దాక ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఇప్పటికే పుష్కరాలపై పలు దఫాలు సమావేశాలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతులను కలవడం, పుష్కరఘాట్లను గుర్తించడం వంటి పనులు చకచకా జరిగిపోతుండగా.. రాష్ట్రంలో మాత్రం నేటిదాక పుష్కరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా..? లేదా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వానికి మంత్రాలయ పీఠాధిపతి లేఖ రాసినా స్పందన కనిపించలేదు. 

బాధ్యత ఒక్క శాఖదేనా.. 
పుష్కరాలంటే దేవాదాయశాఖ మాత్రమేనా అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరింస్తుదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కోవిడ్‌–19 ఉన్నప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుష్కరాలకు వస్తారని, కనీసం 50శాతమైన భక్తు లు వస్తారని బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఘాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, వాహనాల పార్కింగ్, నదీ తీరంలో పిండ ప్రదానాలకు షెడ్లు, రహదారుల విస్తరణ, విద్యుత్‌ అలంకరణ, తాగునీరు ఇలా ఎన్నో పనులు చేపట్టాల్సి వస్తుంది. జోగుళాంబ ఆలయం సమీపంలో ముందే ఇరుకైన స్థలం ఉండడం, దీనికి తోడు రహదారులకు ఇరువైపులా ఆక్రమణకు గురికావడం, ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే అనేక వ్యాపార దుకాణాలతో కబ్జాకు గురయ్యాయి.  

చిత్తశుద్ధి కరువు 
సీఎం కేసీఆర్‌ తన భక్తి ప్రపత్తులను కేవలం యాదాద్రి వరకు మాత్రమే పరిమితం చేస్తున్నారని.. జోగుళాంబ ఆలయం, తుంగభద్ర నది పుష్కరాలపై చిత్తశుద్ధి కరువైందని స్థానికులు ఆరోపిస్తు న్నారు. జోగుళాంబ సేవాసమితి వారు ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరేందుకు బీజేపి, కాంగ్రెస్‌ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సమాయత్తం
కానున్నారు. 

సీఎం దృష్టి సారించాలి 
రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన అలంపూర్‌లో త్వరలో ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. సీఎం కేసీఆర్‌కు యాదాద్రి తప్పా జోగుళాంబ అమ్మవారు కనిపించడంలేదు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ పుష్కరాలు సరైన సమయం. ఈ విషయంలో సీఎం ఇప్పటికైన దృష్టి సారించాలి.  – డీకే అరుణ, మాజీ మంత్రి, గద్వాల 
 
నాటి హామీలే నేరవేర్చలేదు 
2016లో జరిగిన కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు వచ్చిన సీఎం అప్పట్లో అలంపూర్‌ అభివృద్ధిపై ఇచ్చిన హామీలే నేటికీ నెరవేర్చలేదు. ఇక తుంగభద్ర పుష్కరాలు కనీసం నిర్వహిస్తారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వంలో ప్రజలే కాక జోగుళాంబ అమ్మవారు కూడా ఇబ్బందులు పడాలేమో. – సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ 
  
పుష్కరాలు నిర్వహించాలి 
తుంగభద్ర నది పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఈ విషయంలో సీఎం చొరవ చూపాలి. అనేక సమావేశాలలో సీఎం నోట అలంపూర్‌ మాట వినిపించింది. ఇప్పుడు పుష్కరాలపై కూడా ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి. – బీవీ.బాబు, జోగుళాంబ సేవాసమితి ఉపాధ్యక్షుడు 
  
ఏర్పాట్లపై త్వరలో సమావేశం 
తుంగభద్ర నది పుష్కరాల విషయమై ఈ రెండు రోజుల్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందనే బావిస్తున్నాం.  – ప్రేమ్‌కుమార్, ఈఓ, జోగుళాంబ ఆలయం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement