సాక్షి, అమరావతి : తుంగే పానే.. గంగే స్నానే అన్నది ఆర్యోక్తి. గంగా నదిలో స్నానంచేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర నీటిని తాగితే అంతే పుణ్యం వస్తుందన్నది దీని అర్థం. కానీ.. ఇప్పుడు తుంగభద్ర నదీ జలాలను శుద్ధిచేయకుండా నేరుగా తాగితే పుణ్యం మాట ఏమోగానీ వ్యాధుల బారినపడే ప్రమాదం అధికంగా ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక తేల్చిచెబుతోంది.
కర్ణాటక పరిధిలో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, వ్యర్థాలను యథేచ్ఛగా నదిలోకి వదిలేయడంవల్ల నదీ జలాలు కలుషితమయ్యాయి. జాతీయ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటికి బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) రెండు మిల్లీగ్రాములలోపు ఉండాలి. కానీ.. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి గరిష్టంగా 7 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 6.2 మిల్లీగ్రాములు ఉండటాన్ని బట్టి చూస్తే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర పరిధిలో మంత్రాలయం, బావపురం మధ్య తుంగభద్ర జలాల్లో లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీ గ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీ గ్రాములు ఉండటం గమనార్హం.
నాడు స్వచ్ఛతకు.. నేడు కాలుష్యానికి..
కర్ణాటక పరిధిలోని పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,196 మీటర్ల ఎత్తులో తుంగ ఒకవైపు.. భద్ర మరోవైపు జని్మంచి.. 147 కి.మీ. దూరం తుంగ నది, 171 కి.మీ. దూరం భద్ర నది పయనించాక కూడలి వద్ద రెండు నదులూ సంగమించి.. ఒకటిగా 547 కి.మీ. దూరం ప్రవహించి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌కు సమీపంలో గొందిమల్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నిజానికి... కృష్ణాకు ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర ఒకప్పుడు స్వచ్ఛతకు పెట్టింది పేరు. కర్ణాటక పరిధిలోని తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నది పరిసర ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాలను యథేచ్ఛగా వదిలేయడంవల్ల కాలుష్య కాసారంగా మారింది. గతేడాది నవంబర్‌లో తుంగభద్ర జలాల స్వచ్ఛతపై సీడబ్ల్యూసీ, సీపీసీబీ సంయుక్తంగా అధ్యయనం చేసి నవంబర్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి.
ప్రమాదకర స్థాయిలో కాలుష్యం..
- కర్ణాటకలో శివమొగ్గ వద్ద తుంగ నదీ జలాల్లో లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు సీడబ్ల్యూసీ–సీపీసీబీ తేల్చాయి.
- కర్ణాటక పరిధిలోని భద్రావతి నుంచి హోలెహొన్నూరు వరకూ భద్ర నదీ జలాల్లో లీటర్ నీటికి 7 మిల్లీగ్రాముల బీఓడీ ఉన్నట్లు అవి గుర్తించాయి.
- తుంగ, భద్ర కలిసి తుంగభద్రగా రూపాంతరం చెందే ప్రాంతం కూడలి నుంచి మైలార, ఉల్లనూరు నుంచి హొకినేహళ్లి వరకూ నదీ జలాల్లో లీటర్ నీటికి బీఓడీ 6.2 మిల్లీగ్రాములు ఉంది.
- కర్ణాటకలో వ్యర్థాలతో కలుషితమైన ఈ జలాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక మంత్రాలయం నుంచి బావపురం మధ్య ప్రాంతంలోనూ లీటర్ నీటికి బీఓడీ గరిష్టంగా 6.2 మిల్లీగ్రాముల నుంచి కనిష్టంగా 3 మిల్లీగ్రాములు ఉంది.
- తుంగభద్ర నదిలో కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న శివమొగ్గ, భద్రావతి–హోలెహొన్నూరు, కూడలి–మైలార, ఉల్లనూరు–హోకినేహళ్లి ప్రాంతాల్లో మురుగు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధిచేశాకే నదిలోకి వదలాలని కేంద్రానికి సీడబ్ల్యూసీ–సీపీసీబీ నివేదిక ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment