పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. చార్మినార్ పోలీసులు తనపై తప్పుడు సెక్షన్ల కింద దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వసుందర్‌చారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి..‘పిటిషనర్‌పై ఉన్న ఒకే ఒక ఆరోపణ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపటం. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ నేరం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 420 పరిధిలోకి రాదు. అంతేకాకుండా, సెక్షన్ 80(ఏ) కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ అభియోగాలు మోపారు. వాహనాల పరి్మట్ కోసం దరఖాస్తు చేయడం, మంజూరు విధానం గురించి ఈ సెక్షన్ చెబుతుంది.
కాబట్టి, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినా సెక్షన్ 80(ఏ)కి వర్తించదు. పిటిషనర్ నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే నిబంధనల ప్రకారం పోలీసులు జరిమానా విధించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఈ కారణంగా పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేస్తున్నాం’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment