కో–ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్‌పై మరోసారి హైకోర్టు ఆగ్రహం
‘జూబ్లీహిల్స్ సొసైటీ’ అక్రమాలపై విచారణ
కమిటీ నివేదికను గడువులోగా పిటిషనర్‌కు ఎందుకివ్వలేదని నిలదీత
కోర్టు ఆదేశాలంటే లెక్కలేనితనం సరికాదని వ్యాఖ్య.. విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమా లపై ఏర్పాటైన విచారణ కమిటీ రూపొందించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఇవ్వాల ని తాము ఆదేశిస్తే ఐదు నెలలైనా ఇవ్వకపోవడం సహకార శాఖ కమిషనర్ పూర్తి బాధ్యతా రాహిత్యమేనని హైకోర్టు మండిపడింది. ధిక్కరణ పిటిషన్ వేసి నోటీసులు జారీ చేశాక నివేదిక ఇస్తా రా? అంటూ కో–ఆపరేటివ్ సొసైటీస్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎం.హరితను ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు వింటామని.. ఒకవేళ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమైతే శిక్ష తప్ప దని కమిషనర్‌ను హెచ్చరించింది. కోర్టు ధిక్క రణ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించింది. కోర్టులంటే లెక్కలేనితనం సరికాదని.. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని చెబుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ నేపథ్యం..
జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అక్రమాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన నివేదికను తనకు ఇప్పించాలంటూ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ గతంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని... 2022 మార్చి 23న విచారణ కమిటీ సమర్పించిన నివేదికను రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఇవ్వాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో సహకార కమిషనర్‌ను ఆదేశించింది.
అయితే గడువులోగా కమిషనర్ నివేదిక ఇవ్వకపోవడంతో జూన్‌లో మురళీ ముకుంద్ ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై గత విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్ హరితపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ హైకోర్టు ఆదేశాలు మే 6న అందాయని.. అవి పరిశీలన దశలో ఉండగానే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయని కౌంటర్‌లో పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి వల్ల నివేదిక ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని.. నివేదికను సెప్టెంబర్ 11న పిటిషనర్‌కు అందజేశామన్నారు. అయితే ఈ కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. దానిపై రిప్లై ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక ఏం చేయాలన్నది నిర్ణయిస్తామంటూ విచారణ నవంబర్ 8కి వాయిదా వేసింది. కోర్టుకు హాజరు నుంచి కమిషనర్‌కు మినహాయింపు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment