సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో పట్టా భూములతోపాటు అసైన్డ్ భూములకూ సమానంగా పరిహారమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌లో మెరిట్ లేదంటూ కొట్టివేసింది.
ఒకే పరిహారం కోరుతూ..
ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న పట్టాభూములకు, అసైన్డ్ భూములకు ఒకే పరిహారం ఇవ్వాలంటూ కిన్నెర శ్యామ్‌తోపాటు మరో 26 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఒకేలా పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ 2022 మార్చి 10న తీర్పు ఇచ్చారు. ఆ విచారణ సందర్భంగా భూసేకరణ అధికారి వర్సెస్ మేకల పాండు కేసులో గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు.
అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా ప్రత్యేక కలెక్టర్, మరికొందరు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున పి.భావనారావు, ప్రతివాదుల తరఫున శ్రీనివాస్‌రావు, కీర్తి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని, సమానంగా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం పూర్తిగా పరిహారం చెల్లించకుండానే భూమిని సేకరించడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించింది.
ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిహారంలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పానగల్ వద్ద ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1998 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణ పరిహారాన్ని నిర్ణయిస్తూ అదే ఏడాది జూలైలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. పట్టాభూములకు ఎకరానికి రూ.31,500 పరిహారం నిర్ణయించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు ఎకరానికి ఇంత అని కాకుండా, కొంతమొత్తం పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పరిహారంపై సంతృప్తి చెందని పట్టాదారులు పలుమార్లు కోర్టును ఆశ్రయించగా పరిహారం ఎకరానికి రూ.1,10,000కు పెరిగింది. ఈ క్రమంలో తమకు కూడా పరిహారాన్ని పెంచాలంటూ 2011 నుంచి 2015 వరకు అసైన్‌్డదారులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment