Hyderabad: Massive Traffic Jam in Lingampally Chowrasta, Details Inside - Sakshi
Sakshi News home page

Lingampally Traffic Jam: చక్రబంధంలో లింగంపల్లి చౌరస్తా 

Published Fri, May 27 2022 2:55 PM | Last Updated on Fri, May 27 2022 4:40 PM

Hyderabad: Commuters Fume As Massive Traffic Jam in Lingampally Chowrasta - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ చౌరస్తా దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రధానంగా నగరానికి వెళ్లాలన్నా.. జిల్లా కేంద్రానికి.. సెంట్రల్‌ యూనివర్సిటీకి ఎటు వెళ్లాలన్నా.. ఆ రోడ్డు మీదుగా వెళ్లాల్సిందే. కానీ ఎటు వెళ్లాలన్నా కనీసం రెండు గంటల ముందు బయల్దేరాలంటే మాత్రం అతిశయోక్తి కాదు. సిగ్నల్‌ పడిందా గోవిందా.. అర కిలోమీటరు మేర వాహనాల క్యూ.. ఇంకేముంది మరో అరగంట ఆలస్యం. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ ఇక అంతే సంగతులు. జిల్లాలోని లింగంపల్లి చౌరస్తాలోని మూడు రోడ్లను చూస్తే ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి.. మౌలిక వసతులు.. వాహనదారుల ట్రాఫిక్‌ కష్టాలు.. నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేకం.. 

సర్వీసు రోడ్లు లేక..  
రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు సరిపడా రోడ్డు వెడల్పు లేకపోవడంతో సర్వీసు రోడ్డును తీసివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ సర్వీసు రోడ్డు కాస్త ప్రధాన రోడ్లలోనే కలిపివేశారు. సర్వీసు రోడ్లు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చౌరస్తా నుంచి ఇక్రిశాట్‌ వరకు సర్వీసు రోడ్డు లేకుండా పోయింది. 


ఉదయం, సాయంత్రం వేళల్లో.. 

ఈ చౌరస్తాలో గచ్చిబౌలి వైపు వెళ్లే, వచ్చే వాహనాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 వరకు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. వారాంతంలో వాహనదారులు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  


రోడ్డుపైనే ఆగుతున్న బస్సులు  

వాహనదారులు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదు. పటాన్‌చెరు వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే ఎడమవైపు రోడ్డుపైనే సంగారెడ్డి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, సిటీబస్సులు నిలుపుతున్నారు. సిగ్నల్‌తో సంబంధం లేకుండా కూకట్‌పల్లి వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. చౌరస్తాలో చుట్టుపక్కల వాణిజ్య సముదాయాలకు కూడా సరైన పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో వాహనాలు రోడ్డుకు దగ్గరగానే పార్క్‌ చేయాల్సి వస్తోంది. 


బస్‌బే నిరుపయోగం.. 

ఆర్టీసీ బస్సులు రోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించుతుండడంతోట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీన్ని అధిగమించేందుకు చౌరస్తాలో నిర్మించిన బస్‌బే నిరుపయోగంగా ఉంది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ బస్‌బేలో బస్సులను నిలపడం లేదు. ఎప్పటిలాగే రోడ్డుపైనే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇది ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతోంది. 

సుమారు 20 శాతం వాహనాలు.. 
జంట నగరాల్లో ప్రతి నిత్యం సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు వాహనాలు తిరుగుతుంటే.. ఇందులో సుమారు 20 శాతం వాహనాలు ఐటీ కంపెనీలకు అతి సమీపంలో ఉన్న  పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి ప్రాంతం నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లుగా అనధికారిక అంచనా. ఇస్నాపూర్‌ వద్ద గతంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉండగా, రోడ్డు వెడల్పు చేయడంతో సమస్య కొంత మేర తగ్గింది. 


పలుచోట్ల బ్లాక్‌ స్పాట్లు 

పటాన్‌చెరు నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు పలు చోట్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్రిశాట్‌ సమీపంలో, ఆర్సీపురం డైమండ్‌ చౌరస్తాలో, బీరంగూడ కమాన్‌ సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది ఈ ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు మృత్యువాత పడగా, ఇద్దరు క్షతగాత్రులయ్యారు. దీంతో పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, కొన్ని చోట్ల ప్రత్యేకంగా యూటర్న్‌లను ఏర్పాటు చేశారు.  


చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు.. 

నిమిషానికి వందల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్లే ఈ బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లి చౌరస్తాలో ఒకే ఒక్క కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు మొదటి షిఫ్టు, అప్పటినుంచి రాత్రి వరకు మరో కానిస్టేబుల్‌ విధుల్లో ఉంటున్నారు. ట్రాఫిక్‌ సీఐ, ఎస్‌ఐలు తరచూ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. 

స్పీడ్‌ లిమిట్‌ ఉన్నా.. 
ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు పలు చోట్ల స్పీడ్‌ లిమిట్‌లను ఏర్పాటు చేశారు. గండమ్మగుడి సమీపంలో, ఆర్సీపురం రైల్వేట్రాక్‌ సమీపంలో స్పీడ్‌ లిమిట్‌ 40 సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ చాలా మంది వాహనదారులు ఈ స్పీడ్‌ లిమిట్‌ను పాటించడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కూడా వేగంగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 


కొత్త కాలనీలు వెలవడంతో.. 

పటాన్‌చెరుతో పాటు తెల్లాపూర్, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల పరిధిలో పలు కొత్త కాలనీలు వెలిశాయి. కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, నల్లగండ్ల, కొల్లూరు, బీరంగూడ, ఇస్నాపూర్‌ వంటి ప్రాంతంలో కూడా గేటెడ్‌ కమ్యునిటీ విల్లాలు, అపార్టుమెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక్కడి నుంచి నిత్యం లక్షలాది మంది నిత్యం గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లిలతో పాటు, నగరంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది.

పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరులో పరిశ్రమల ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు, ముడిసరుకుల రవాణ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ పెరుగుతోంది. బాంబేహైవే మీదుగా వచ్చి వెళ్లే వాహనాలు కూడా లింగంపల్లి చౌరస్తా మీదుగా సిటీలోకి వెళ్లివస్తుంటాయి. జహీరాబాద్, సంగారెడ్డి, బీదర్‌ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఇక్కడి నుంచే నగరంలోకి ప్రవేశిస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ తీవ్రంగా ఉంటోంది. 


రోడ్డు దాటాలంటే అవస్థలు.. 

ఈ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ ముందున్న సిటీ బస్టాప్‌ నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారు.  (క్లిక్‌: స్టాంప్‌ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్‌’ తిప్పలు!)

చౌరస్తా దాటాలంటే పావుగంట పడుతోంది  
ప్రతిరోజు పటాన్‌చెరు వైపు నుంచి గౌచ్చిబౌలి వైపు వెళ్లి వస్తుంటాను. లింగంపల్లి చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ చౌరస్తా దాటాలంటే ఒక్కోసారి పావు గంట పడుతోంది. వీకెండ్‌లో ఇటువైపు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. 
– అఖిలేష్, వాహనదారుడు 

ఇబ్బందులు తగ్గాయి  
పటాన్‌చెరు నుంచి కూకట్‌పల్లి వైపు నిత్యం ఆటో నడుపుతుంటాను. గతంతో పోల్చితే ఇప్పుడు కొంత ఇబ్బందులు తగ్గాయి. లింగపల్లి చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒక్కోసారి ఈ రూట్‌లో ఆటో నడపడం కష్టంగా ఉంటోంది.     
– జావెద్, ఆటోడ్రైవర్‌  

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం 
రామచంద్రాపురం చౌరస్తాలో ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క శనివారం రోజు కొంత సమయం ట్రాఫిక్‌ జాం అవుతోంది. ట్రాఫిక్‌ విధుల్లో ముగ్గురు పనిచేస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. 
– సుమన్, ట్రాఫిక్‌ సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement