Lingampally
-
ప్రభుత్వం మారినా అదే తీరు.. పబ్లిక్ కి శాపంగా లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జి..
-
ఈ రోడ్డుపై వెళితే నడుము విరగాల్సిందే?
-
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలు ఇవిగో..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి, తదితర రూట్లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. పలు రైళ్లు రద్దు.. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా) -
Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– సికింద్రాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. మరో మూడు రోజులు వర్షసూచన మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా శేరిలింగంపల్లి, మాదాపూర్‌లలో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. అభివృద్ధి పనులను పరిశీలించిన అర్వింద్‌కుమార్ గండిపేట్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంఫీ థియేటర్, రెస్టారెంట్, పలు అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రకృతి రమణీయత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సిటీజన్లకు చక్కటి ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ) -
లింగంపల్లి–కాకినాడ, నాంపల్లి–జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రద్దీ నేపథ్యంలో లింగంపల్లి–కాకినాడ, హైదరాబాద్–జైపూర్ మధ్య అదనపు రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి–కాకినాడ మధ్య (07296) జూలై 2 నుంచి అక్టోబరు 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. కాకినాడ–లింగంపల్లి మధ్య జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో (07295).. హైదరాబాద్–జైపూర్ మధ్య జూలై 1 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి శుక్రవారం (07115).. జైపూర్–హైదరాబాద్ మధ్య జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి ఆదివారం (07116) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ రైళ్లు లింగంపల్లిలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరనుండగా, జైపూర్ రైళ్లు నాంపల్లిలో రాత్రి 8.20కి బయల్దేరుతాయి. డబ్లింగ్ పనులతో పలు రైళ్ల రద్దు.. సెంట్రల్ రైల్వే పరిధిలోని మన్మాడ్ సెక్షన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. జూన్ 23 నుంచి 28 వరకు ఈ రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది. విశాఖ–షిర్డీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్ 23 తిరుగుప్రయాణం కాగా, 24న రద్దు కానున్నాయి. సీఎస్టీ ముంబై–జాల్నా ఎక్స్‌ప్రెస్ 25 నుంచి 28 వరకు, తిరుగుప్రయాణంలో 29 వరకు, ఆదిలాబాద్–ముంబై ఎక్స్‌ప్రెస్ 26 నుంచి 27 తేదీల్లో, తిరుగుప్రయాణంలో 27, 28 తేదీల్లో, కాజీపేట–దాదర్ 25, తిరుగుప్రయాణంలో మరుసటిరోజు, పుణే–కాజీపేట 24న, కాజీపేట–పుణే 26న రద్దయ్యాయి. కాకినాడ పోర్టు–సాయినగర్ షిర్డీ 25, 27లలో, తిరుగుప్రయాణంలో 26, 28లలో, సికింద్రాబాద్–షిర్డీ ఎక్స్‌ప్రెస్ 24, 26లలో తిరుగుప్రయాణంలో 25, 27లలో నాగర్సోల్–షిర్డీ మధ్య రద్దయ్యాయి. సికింద్రాబాద్–మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ 24 నుంచి 27 వరకు, తిరుగుప్రయాణంలో 25 నుంచి 25 వరకు నాగర్సోల్–మన్మాడ్ మధ్య రద్దయ్యాయి. (క్లిక్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్) -
చక్రబంధంలో లింగంపల్లి.. చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ చౌరస్తా దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రధానంగా నగరానికి వెళ్లాలన్నా.. జిల్లా కేంద్రానికి.. సెంట్రల్ యూనివర్సిటీకి ఎటు వెళ్లాలన్నా.. ఆ రోడ్డు మీదుగా వెళ్లాల్సిందే. కానీ ఎటు వెళ్లాలన్నా కనీసం రెండు గంటల ముందు బయల్దేరాలంటే మాత్రం అతిశయోక్తి కాదు. సిగ్నల్ పడిందా గోవిందా.. అర కిలోమీటరు మేర వాహనాల క్యూ.. ఇంకేముంది మరో అరగంట ఆలస్యం. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ ఇక అంతే సంగతులు. జిల్లాలోని లింగంపల్లి చౌరస్తాలోని మూడు రోడ్లను చూస్తే ముచ్చెమటలు పట్టాల్సిందే. ఆ పరిసర ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి.. మౌలిక వసతులు.. వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు.. నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేకం.. సర్వీసు రోడ్లు లేక.. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు సరిపడా రోడ్డు వెడల్పు లేకపోవడంతో సర్వీసు రోడ్డును తీసివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ సర్వీసు రోడ్డు కాస్త ప్రధాన రోడ్లలోనే కలిపివేశారు. సర్వీసు రోడ్లు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చౌరస్తా నుంచి ఇక్రిశాట్ వరకు సర్వీసు రోడ్డు లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో.. ఈ చౌరస్తాలో గచ్చిబౌలి వైపు వెళ్లే, వచ్చే వాహనాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. వారాంతంలో వాహనదారులు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోడ్డుపైనే ఆగుతున్న బస్సులు వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. పటాన్చెరు వైపు నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే ఎడమవైపు రోడ్డుపైనే సంగారెడ్డి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, సిటీబస్సులు నిలుపుతున్నారు. సిగ్నల్‌తో సంబంధం లేకుండా కూకట్పల్లి వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. చౌరస్తాలో చుట్టుపక్కల వాణిజ్య సముదాయాలకు కూడా సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాలు రోడ్డుకు దగ్గరగానే పార్క్ చేయాల్సి వస్తోంది. బస్బే నిరుపయోగం.. ఆర్టీసీ బస్సులు రోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించుతుండడంతోట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీన్ని అధిగమించేందుకు చౌరస్తాలో నిర్మించిన బస్బే నిరుపయోగంగా ఉంది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ బస్‌బేలో బస్సులను నిలపడం లేదు. ఎప్పటిలాగే రోడ్డుపైనే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇది ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. సుమారు 20 శాతం వాహనాలు.. జంట నగరాల్లో ప్రతి నిత్యం సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు వాహనాలు తిరుగుతుంటే.. ఇందులో సుమారు 20 శాతం వాహనాలు ఐటీ కంపెనీలకు అతి సమీపంలో ఉన్న పటాన్చెరు, బీహెచ్ఈఎల్, లింగంపల్లి ప్రాంతం నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లుగా అనధికారిక అంచనా. ఇస్నాపూర్ వద్ద గతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండగా, రోడ్డు వెడల్పు చేయడంతో సమస్య కొంత మేర తగ్గింది. పలుచోట్ల బ్లాక్ స్పాట్లు పటాన్చెరు నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు పలు చోట్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్రిశాట్ సమీపంలో, ఆర్సీపురం డైమండ్ చౌరస్తాలో, బీరంగూడ కమాన్ సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది ఈ ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు మృత్యువాత పడగా, ఇద్దరు క్షతగాత్రులయ్యారు. దీంతో పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇష్టానుసారంగా రోడ్డు దాటకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, కొన్ని చోట్ల ప్రత్యేకంగా యూటర్న్‌లను ఏర్పాటు చేశారు. చౌరస్తా మొత్తానికి ఒకే ఒక్కడు.. నిమిషానికి వందల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్లే ఈ బీహెచ్ఈఎల్ లింగంపల్లి చౌరస్తాలో ఒకే ఒక్క కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు మొదటి షిఫ్టు, అప్పటినుంచి రాత్రి వరకు మరో కానిస్టేబుల్ విధుల్లో ఉంటున్నారు. ట్రాఫిక్ సీఐ, ఎస్ఐలు తరచూ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. స్పీడ్ లిమిట్ ఉన్నా.. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల స్పీడ్ లిమిట్లను ఏర్పాటు చేశారు. గండమ్మగుడి సమీపంలో, ఆర్సీపురం రైల్వేట్రాక్ సమీపంలో స్పీడ్ లిమిట్ 40 సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కానీ చాలా మంది వాహనదారులు ఈ స్పీడ్ లిమిట్‌ను పాటించడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కూడా వేగంగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త కాలనీలు వెలవడంతో.. పటాన్‌చెరుతో పాటు తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో పలు కొత్త కాలనీలు వెలిశాయి. కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, నల్లగండ్ల, కొల్లూరు, బీరంగూడ, ఇస్నాపూర్ వంటి ప్రాంతంలో కూడా గేటెడ్ కమ్యునిటీ విల్లాలు, అపార్టుమెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక్కడి నుంచి నిత్యం లక్షలాది మంది నిత్యం గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లిలతో పాటు, నగరంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో పరిశ్రమల ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు, ముడిసరుకుల రవాణ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ పెరుగుతోంది. బాంబేహైవే మీదుగా వచ్చి వెళ్లే వాహనాలు కూడా లింగంపల్లి చౌరస్తా మీదుగా సిటీలోకి వెళ్లివస్తుంటాయి. జహీరాబాద్, సంగారెడ్డి, బీదర్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇక్కడి నుంచే నగరంలోకి ప్రవేశిస్తుంటాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ తీవ్రంగా ఉంటోంది. రోడ్డు దాటాలంటే అవస్థలు.. ఈ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ ముందున్న సిటీ బస్టాప్ నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే పిల్లాపాపలతో అవస్థలు పడుతున్నారు. (క్లిక్: స్టాంప్ డ్యూటీకి ‘ఫ్రాంకింగ్’ తిప్పలు!) చౌరస్తా దాటాలంటే పావుగంట పడుతోంది ప్రతిరోజు పటాన్చెరు వైపు నుంచి గౌచ్చిబౌలి వైపు వెళ్లి వస్తుంటాను. లింగంపల్లి చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ చౌరస్తా దాటాలంటే ఒక్కోసారి పావు గంట పడుతోంది. వీకెండ్లో ఇటువైపు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. – అఖిలేష్, వాహనదారుడు ఇబ్బందులు తగ్గాయి పటాన్చెరు నుంచి కూకట్పల్లి వైపు నిత్యం ఆటో నడుపుతుంటాను. గతంతో పోల్చితే ఇప్పుడు కొంత ఇబ్బందులు తగ్గాయి. లింగపల్లి చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒక్కోసారి ఈ రూట్లో ఆటో నడపడం కష్టంగా ఉంటోంది. – జావెద్, ఆటోడ్రైవర్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం రామచంద్రాపురం చౌరస్తాలో ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క శనివారం రోజు కొంత సమయం ట్రాఫిక్ జాం అవుతోంది. ట్రాఫిక్ విధుల్లో ముగ్గురు పనిచేస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుమన్, ట్రాఫిక్ సీఐ -
టాప్‌లో శేరిలింగంపల్లి.. గతంతో పోల్చితే తగ్గిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఆక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మహానగర పరిధిలో దాదాపు 58 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడేళ్ల క్రితం విడుదల చేసిన జీవోలు 58, 59లకు అనుబంధంగా తాజాగా జీవో 14 విడుదల చేసి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో క్రమబద్ధీకరణకు నోచుకొని అక్రమిత నివాస స్ధలాల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. అందులో సైతం నగర శివార్లు శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్మేట్, బాలపూర్, సరూర్‌నగర్, షేక్‌పేట, హయత్‌నగర్ మండలాల్లో అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం మీద గతంలో 1.66 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి అందులో 35 శాతానికి పడిపోయాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డిలో 31,830, ఆ తర్వాత మేడ్చల్‌లో 14,500కు పైగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో జీవో 58, 59 కింద దరఖాస్తులు ఇలా: శేరిలింగంపల్లి 9854, అబ్దుల్లాపూర్‌మెట్ 5990, బాలాపూర్ 4494, సరూర్‌నగర్ 3669, షేక్‌పేట 2980, హయత్‌నగర్ 2471, ఖైరతాబాద్ 1987, గండిపేట 1741, ఆసీఫ్‌నగర్ 1732, రాజేంద్రనగర్ 1527, సైదాబాద్ 1147, శంకర్పల్లి 883, ముషీరాబాద్ 751, మారేడుపల్లి 706, సికింద్రాబాద్ 458, ఇబ్రహీంపట్నం 354, అంబర్‌పేట 265, మహేశ్వరం 246, బండ్లగూడ 236, హిమాయత్‌నగర్ 202, శంషాబాద్ 166, గోల్కొండ 114, నాంపల్లి 113, బహదూర్‌పురా 87, ఆమన్‌గల్ 87, అమీర్‌పేట 86, మొయినాబాద్ 67. -
ఎంఎంటీఎస్ రైళ్లకు మళ్లీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లకు మరోసారి బ్రేక్ పడింది. ట్రాక్ నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా సోమవారం 36 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్‌నుమా– లింగంపల్లి, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్‌నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. నిర్వహణపరమైన కారణాలతో రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడం, కనీస స్థాయిలో ఆదాయం లభించకపోవడం వంటి కారణాలతోనే సర్వీసులు రద్దవుతున్నాయి. గడ్డుకాలం.. తాజాగా కోవిడ్ మూడో ఉద్ధృతి మొదలైన నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ మరింత భారంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.5 కనిష్ట చార్జీల నుంచి రూ.15 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయాన్ని అందజేసే అత్యంత చౌకైన రవాణా సర్వీసులు నగరంలో ఎంఎంటీఎస్ ఒక్కటే. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా ఎంఎంటీఎస్‌కు గడ్డుకాలంగా మారింది. లా క్‌డౌన్ అనంతరం దశలవారీగా సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ పెద్దగా ఆదరణ లభించడం లేదు. (చదవండి: అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!) వారంలో రెండు మూడుసార్లు.. ► గతంలో సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్ను మా– సికింద్రాబాద్, లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి– లింగంపల్లి తదితర రూట్లలో ప్రతిరోజూ 121 సర్వీసులు నడిచేవి. రోజుకు 1.5 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్ వల్ల ఏడాది పాటు సర్వీసులను నిలిపివేశారు. గతేడాది మొదట్లో 25 సర్వీసులతో పునరుద్ధరణ మొదలుపెట్టి దశలవారీగా ప్రస్తుతం 79 కి పెంచారు. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు) ► ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో వారంలో రెండు మూడు సార్లు కనీసం 20 నుంచి 25 సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రస్తుతం సగానికి సగం అంటే 36 సర్వీసులను సోమవారం ఒక్కరోజే రద్దు చేయనున్నారు. సాధారణంగా సికింద్రాబాద్– లింగంపల్లి మార్గంలో ప్రయాణికులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. కోవిడ్ మూడో ఉద్ధృతితో అనేక ప్రైవేట్ సంస్థలు, ఐటీ సంస్థలు తిరిగి వర్క్‌ఫ్రం హోమ్‌కు అవకాశం కల్పించాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. -
లాక్డౌన్ : తెలంగాణ నుంచి తొలి రైలు
హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో కొద్ది రోజుల్లో రెండో దశ లాక్డౌన్ పూర్తవుతుందనగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే రోడ్డు మార్గం ద్వారానే వారిని స్వస్థలాలకు తరలించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు తాత్కాలిక రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆ డిమాండ్‌పై కేంద్రం కొంత సానుకూలంగా స్పందించింది. తెలంగాణలోని వలస కూలీలను తరలించేందుకు లింగపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియా వరకు ప్రత్యేక రైలు నడపనుంది. 24 బోగీలతో కూడిన ఈ రైలు శుక్రవారం ఉదయం 5 గంటలకు బయలుదేరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ రైలు నడిపేందుకు అనుమతించింది. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటీలో ఉన్న 500 మంది కార్మికులను 57 ప్రభుత్వ బస్సుల్లో ఈరోజు తెల్లవారుజామున లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. కాగా, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదే. చదవండి : సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు -
లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. లింగంపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం 6.15 గంటలకు బయల్దేరిన రైలు వైజాగ్‌కు సాయంత్రం 7.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొనసాగిన ఈ రైలును లింగంపల్లి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించారు. ఇప్పటికి లింగంపల్లి నుంచి నారాయణాద్రి, కాకినాడ, గౌతమి, హంసఫర్, అమరావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా జన్మభూమి కూడా వాటి జాబితాలో చేరింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ప్రయాణికులకు సికింద్రాబాద్ వరకు వెళ్లే ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. -
పొదల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
-
పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు: విద్యార్థులకు గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లింగంపల్లి వద్ద అధిక వేగంతో వెళ్తున్న స్కూల్ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు స్టీరింగ్ ఊడిరావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి... స్కూల్ బస్సులోని విద్యార్థులను బయటకు తీశారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బ్యాగ్ లో యువతి మృతదేహం
హైదరాబాద్ : లింగంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం దారుణం వెలుగుచూసింది. రైల్లోని బోగీలో వదిలేసి ఉన్న ఓ బ్యాగ్‌ను రైల్వే పోలీసులు తెరచి చూడగా గుర్తుతెలియని యువతి ( సుమారు 20 సంవత్సరాలు) మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం
హైదరాబాద్: లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయింది. రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్‌ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది. క్యాబిన్లో ఇరుక్కునపోయిన డ్రైవర్‌ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.