
హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో కొద్ది రోజుల్లో రెండో దశ లాక్‌డౌన్ పూర్తవుతుందనగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే రోడ్డు మార్గం ద్వారానే వారిని స్వస్థలాలకు తరలించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు తాత్కాలిక రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆ డిమాండ్‌పై కేంద్రం కొంత సానుకూలంగా స్పందించింది.
తెలంగాణలోని వలస కూలీలను తరలించేందుకు లింగపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియా వరకు ప్రత్యేక రైలు నడపనుంది. 24 బోగీలతో కూడిన ఈ రైలు శుక్రవారం ఉదయం 5 గంటలకు బయలుదేరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ రైలు నడిపేందుకు అనుమతించింది. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటీలో ఉన్న 500 మంది కార్మికులను 57 ప్రభుత్వ బస్సుల్లో ఈరోజు తెల్లవారుజామున లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు తరలించారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించడానికి ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదే.