సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విశిష్టతలున్న తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తోంది. రామప్పగుడితో యునెస్కో గుర్తింపు పొందిన రాష్ట్రం.. తాజాగా హైదరాబాద్ లక్కగాజులతో భౌగోళిక సూచీ(జీఐ)లో స్థానంకోసం పోటీ పడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ హలీం, పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందగా.. ఈసారి లక్కగాజులు రేసులో నిలిచాయి. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా... రాష్ట్రానికి చెందిన తాండూరు కందులు కూడా జీఐ పరిశీలనలో ఉన్నాయి.
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రత్యేకత
ఒక ప్రాంతంలోని (భౌగోళికంగా) నాణ్యత, నిర్దిష్ట లక్షణాలతో ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులు, వస్తువులు, చరిత్రాత్మక వారసత్వంగా కొనసాగుతున్న కళలు తదితర విభాగాల్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను అందిస్తారు. ప్రత్యేకమైన సహజ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులను ఎంపిక చేస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన ‘ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్’ (రిజిస్ట్రేషన్, రక్షణ) యాక్ట్ 1999 ఆధారంగా ఈ గుర్తింపు ఇస్తారు.
ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 2004–2005లో ‘డార్జిలింగ్ టీ’ దేశంలో మొట్టÐð ¬దట జీఐ ట్యాగ్ పొందింది. ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల ఇతర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు పొందిన ఉత్పత్తులు, వస్తువులు, పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు 10 సంవత్సరాలు వర్తిస్తుంది. తరువాత మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు.
లక్షణమైన లక్క గాజులు...
హైదరాబాద్ పాతబస్తీలోని ‘లాడ్ బజార్’ లక్క గాజులకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అందమైన గాజులను కొన్ని కుటుంబాలు వందల ఏళ్లుగా తయారు చేస్తున్నాయి. లక్కను కరిగించి దానిని గాజుల ఆకారంలో మలిచి, వాటిపై అందమైన రంగు రాళ్లు, రత్నాలు, మెరిసే గాజు ప్రతిమల వంటివి అతికిస్తారు. దేశ నలుమూలల నుంచే కాదు, నగర పర్యటనకు వచ్చిన విదేశీయులు సైతం ఈ గాజులను కొనడానికి ఆసక్తి చూపిస్తారు.
నగరంలోని క్రిసెంట్ హ్యాండ్‌క్రాఫ్ట్ సొసైటీ ఈ లక్క గాజులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. లాడ్ బజార్‌లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు వస్తే... వీటి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకున్న తాండూరు కందులు కూడా జీఐ ట్యాగ్ కోసం పరిశీలనలో ఉందని సమాచారం.
గతంలోనే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలోని పలు వస్తువులు, ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. హైదరాబాదీ ప్రత్యేక వంటకం ‘హలీమ్’ నగరం నుంచి మొదటగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. రెండు తెలుగురాష్ట్రాల్లో దొరికే బంగినపల్లి మామిడిపండ్లు, పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ కార్వింగ్స్, ఆదిలాబాద్ దోక్రా, నిర్మల్ బొమ్మలు–పెయింటింగ్స్– టాయ్స్–ఫర్నిచర్, గద్వాల్ చీరలు, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, వరంగల్ దర్రీస్, సిద్దిపేట గొల్లభామ చీర, చేర్యాల పెయింటింగ్స్, పుట్టపాక తేలియా రుమాలు, నారాయణపేట నేత చీరలు జీఐ ట్యాగ్ సొంతం చేసుకున్నాయి.
హైదరాబాద్ బిర్యానీకి కూడా జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నించినప్పటికీ.. దాని భౌగోళిక అంశాలు, పుట్టు పూర్వోత్తరాలు తదితర కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. జీఐ గుర్తింపుతో డార్జిలింగ్ టీ, పాష్మినా షాల్, కన్నౌజ్ పెర్ఫ్యూమ్, పోచంపల్లి ఇక్కత్ వంటి వాటికి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment