సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల వయసు అంటే అమ్మా, నాన్న అంటూ వచ్చి రానీ మాటలతో మురిపిస్తుంటారు చిన్నారులు.. ఆ బుజ్జిబుజ్జి మాటలు వింటుంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అదే వయసున్న ఈ చిన్నారి మాత్రం తన మెమరీతో రెండు రికార్డులు సొంత చేసికున్నాడు. శ్లోకాలు, యోగా, పలు దేశాల జెండాలను గుర్తుపట్టడం ఇలా ఒకటేమిటి ఏ విషయమైనా రెండు మూడుసార్లు చెబితే ఆడుతూ పాడుతూ వాటిని గుర్తుంచుకుంటాడు. అంతేకాదు వాటి గురించి ఎప్పుడు అడిగినా టక్కున సమాధానం చెబుతాడు.
ఒకటేమిటీ ఎన్నెన్నో..
సికింద్రాబాద్ సమీపంలోని కార్ఖానా ప్రాంతంలో నివసించే ఏరోనాటికల్ ఇంజినీర్ సుర్పూర్ సుధీంద్ర, ఇన్‌స్ట్రక్చనల్ డిజైనర్ స్వాతిల కుమారుడు దేవాన్ష్. ఏడాదిన్నర వయసులోనే ఉదయం తండ్రి యోగా చేయడం చూసి ఆసనాలు వేయడం మొదలు పెట్టాడు. తండ్రిని చూసి ఓం నమఃశివాయ అంటూ పూజలు చేసేవాడు. దేవాన్ష్ మెమరీ పవర్ గుర్తించిన తల్లిదండ్రులు రెండేళ్ల వయసు నుంచే శ్లోకాలు అభ్యాసం చేయించడం మొదలు పెట్టారు. ఆడుతూ పాడుతూ గురుబ్రహ్మ, గురువిష్ణు, గాయిత్రీ మంత్రం నేర్చుకున్నాడు. అంతేకాదు ఏ కారు లోగో చూపిస్తే ఆ కారు ఏ కంపెనీదో చెప్పేస్తాడు. ఆయా దేశాల జెండాలను చూపిస్తే అది ఏ దేశానిదో, కలర్స్‌ను గుర్తించడం, జంతువుల పేర్లను గుర్తు పెట్టుకుని మరీ చెబుతాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల పేర్లు, వివిధ వృత్తుల్లో ఉండే వారిని చూపిస్తే వారు చేసే వృత్తి గురించి చెప్పేస్తాడు. వెంకటేశ్వర స్వామి ఫొటో చూపిస్తే గోవిందా, గోవిందా అంటాడు. ఏ దేవుడి ఫొటో చూపిస్తే ఆ దేవుడి పేరు గుర్తిస్తాడు.
రెండున్నరేళ్లకే.. రెండు రికార్డులు..
దేవాన్ష్ అద్భుతమైన మెమరీని గుర్తించిన తల్లిదండ్రులు బ్రావో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దృష్టికి తీసుకువెళ్లారు. రెండేళ్ల 11 నెలల వయసులో ఈ రికార్డు సొంతం చేసికున్నాడు దేవాన్ష్ అంతకుముందు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులోనూ పేరు దక్కించుకున్నాడు. గ్లోబల్ కిడ్స్ అచీవ్‌మెంట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పలు యూట్యూబ్ చానెల్స్‌కు తనదైన శైలిలో ఇంటర్వ్యూలు ఇచ్చి సెలబ్రిటీగా మారుతున్నాడు. అతడి ప్రతిభను అందరికీ తెలియజేసేందుకు తల్లి స్వాతి ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తోంది.
చదవండి: హైదరాబాద్‌కు అంకాపూర్ చికెన్
Comments
Please login to add a commentAdd a comment