సాక్షి, హైదరాబాద్: సహజ న్యాయసూత్రాల ప్రకారం కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకే నదీ జలాల్లో ఎక్కువ వాటా దక్కాల్సి ఉందని.. కానీ అన్యాయం జరిగిందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై న్యాయ పోరాటం చేస్తామని.. అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. కేంద్రం కూడా ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని న్యాయం చేయాలన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ‘‘ఆంధ్రా ప్రాంత నాయకులు మమ్మల్ని అవమానపరుస్తూ, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నా కూడా కడుపులో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉంటున్నాం. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు సెటిలర్స్ కాదు. ఈ గడ్డ మీద ఉన్న వాళ్లందరూ మా వాళ్లే. అభివృద్ధిలో పోటీపడుతూ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నది మా అభిమతం. ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నది ఏపీ నేతలే’ అని ఆరోపించారు. కొత్త కేటాయింపులు జరిగాకే ప్రాజెక్టులు కడతామని చెప్పిన ఏపీ.. ఇప్పుడు మాట మార్చడం పై తమకు అభ్యం తరాలు ఉన్నాయన్నారు. ట్రిబ్యునల్ తీర్పులకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు చేపట్టాలని పేర్కొన్నారు.
అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే..
ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నుంచి దృష్టి మరల్చేందుకే కేంద్ర బలగాల మోహరింపు, కేంద్రం చేతికి అధికారాలు వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కొత్తగా నీటి కేటాయింపులు జరగకున్నా ఏపీ ప్రాజెక్టులు కడుతోందని పేర్కొన్నారు. ఏపీ అనుమతులు తీసుకుని నిర్మించే ప్రాజెక్టులకు అవసరమైతే నిధులతోపాటు తమ ఇంజినీర్ల ద్వారా సాంకేతిక సాయం అందిస్తామన్నారు. ఏపీ ప్రాజెక్టుల విషయంగా తెలంగాణలోని ఇతర పార్టీల చేసే వ్యాఖ్యలపై స్పందించబోమని చెప్పారు.
మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటే, అవమానిస్తారా
Published Sat, Jul 3 2021 2:19 AM | Last Updated on Sat, Jul 3 2021 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment