క్యాట్‌లో దక్కని ఊరట..
నేడు ఏపీలో రిపోర్టు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మరికొందరు ఐఏఎస్ అధికారులతోపాటు ఆమ్రపాలి కూడా క్యాట్‌ను ఆశ్రయించగా, బుధవారంలోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్యాట్ ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లాల్సిన వారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ ఆదేశాల కనుగుణంగా యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించడంతో, హైకోర్డు ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలియనందున ముందైతే ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల వరకు వేచి చూడనున్నారు. ఏపీకి వెళ్లినా, రెండు రాష్ట్రాల పరస్పర అవసరాలు, ఒప్పందాలతో తిరిగి తెలంగాణకు రప్పించే అవకాశాలూ ఉంటాయనే ప్రచారం మొదలైంది.
బల్దియా బాస్ ఎవరో..
మరోవైపు, ఆమ్రపాలి స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనేది జీహెచ్‌ఎంసీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ ఐఏఎస్‌ను నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ గురించి, నగర నైసర్గిక స్వరూపం గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిని నియమించగలరనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతమున్న జీహెచ్‌ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రక్రియ జరిగేంతదాకా సీనియర్ ఐఏఎస్ అధికారి అవసరమని అర్బన్‌ప్లానింగ్ నిపుణులు అంటున్నారు.
ఎక్కువ కార్పొరేషన్లుగా విభజన జరిగాక ఎవరున్నప్పటికీ, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యేంత వరకు తగిన అనుభవమున్న సీనియర్ ఉండాలంటున్నారు. 2025 చివర్లో, లేదా 2026 ఆరంభంలో జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఎన్నికలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున, అప్పటివరకు సీనియర్ అధికారి అవసరమంటున్నారు. ప్రస్తుతానికి.. కొంత కాలం వరకు ఎవరైనా సీనియర్ అధికారికి జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జిగా కూడా బాధ్యతలప్పగించవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment