పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు
ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం
ఆదర్శంగా నిలుస్తామంటున్న టెకీలు
సైకిల్ తొక్కడమంటే ఎవరికి ఇష్టముండదు? చిన్న పిల్లలు మొదలుకొని, పెద్దవారి వారకూ ఒకప్పుడు ఇదంటే యమ క్రేజ్.. అయితే రాను రాను పెట్రోల్ వాహనాల రాకతో సైకిల్ కాస్తా కనుమరుగైంది. అయితే ప్రస్తుతం మళ్లీ సైకిళ్లకు క్రేజ్ పెరుగుతోంది. దీనికి తోడు తయారీదారులు సైకిల్‌కి కొత్త హంగులద్ది.. ఈ సైకిల్స్‌గా మారుస్తున్నారు.. దీంతో ఓ వైపు పర్యావరణానికీ, మరోవైపు ఆరోగ్యానికీ మేలు చేకూర్చే ఈ–సైకిల్స్‌కి క్రేజ్ పేరుగుతోంది... ప్రస్తుతం భాగ్యనగరంలో ఇదో ట్రెండ్‌గా మారుతోంది.. అసలు ఈ–సైకిల్స్ కథేంటి? క్రేజ్ పెరగడానికి కారణమేంటి? తెలుసుకుందాం..
శ్వనగరంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లో టెకీలు, ఉన్నత ఉద్యోగుల్లో కొన్ని వర్గాల వారు విద్యుత్తు ఆధారిత సైకిళ్లను నడిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. బిట్స్ పిలానీ హైదరాబాద్, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం ఆ్రస్టేలియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు ప్రశాంత్ సాహు, బందన్మ జుందార్, పరిశోధకుడు జుబివుల్లా ఈ సర్వే నిర్వహించారు.
ఈ–సైకిల్.. పనితీరు ఇలా..
ఈ– సైకిల్ తొక్కుతున్నపుడు ముందుకు వెళ్లే కొలది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. సైకిలిస్ట్‌కు అవసరం అనుకున్నపుడు బ్యాటరీ చార్జింగ్ వినియోగించి సైకిల్‌ను నడిపించొచ్చు. రోడ్డు అప్ ఉన్న ప్రాంతాల్లో ఈ చార్జింగ్ ఉపయోగపడుతుంది. సుమారుగా రూ.20 వేల నుంచి రూ.30 వేల రేంజ్‌లో ఈ–సైకిళ్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి.
సర్వే చెబుతుంది ఇదే...
మొత్తం 482 మంది ఈ–సైకిల్ నడిపిస్తున్న వారిని సంప్రదించగా.. ఒకొక్కరు తమ అభిప్రాయాలను వెళ్లడించారు. ప్రధానంగా మోటారు సైకిల్, కారు వినియోగించాలంటే ఇంధన ధరలు, వాయు, ధ్వని కాలుష్యం భారీగా పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, సాధారణ సమయంలో సైక్లింగ్‌కు అవకాశం లేకపోవడం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కారణాలతో ఈ–సైకిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ–బైక్‌ల వినియోగానికి ఇష్టపడుతున్నారట.
60 శాతం ఈ–సైకిల్‌వైపు మొగ్గు..
ఇదిలా ఉంటే నగర రహదారులపై ప్రయాణికులు ఈ–సైకిల్‌పై ప్రయాణించడం ఒక రోల్ మోడల్‌గా ఉండాలని ఎక్కువ మంది చూస్తున్నారు. చిన్నపాటి దూరం వెళ్లడానికే మోటారు సైకిల్, కారు వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ–సైకిల్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై సర్వే చేశారు. కాగా దాదాపు 60% మంది ప్రయాణికులు ఈ–సైకిల్‌ను నడపడానికి సిద్ధంగా ఉన్నారని అధ్యయన ఫలితాల్లో పేర్కొన్నారు.
సర్వే చేసిన ప్రాంతాలు...
హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు అధ్యయన పత్రాల్లో పేర్కొన్నారు. కాగా 482 మందిలో 48 శాతం పురుషులు ఉండగా, 52 శాతం మంది మహిళా ప్రయాణికులు దీనికి మొగ్గు చూపడం విశేషం. మహిళలు మెట్రో నుంచి ఇంటికి, ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ఈ–సైకిల్స్‌ను వినియోగిస్తున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, బేగంపేట్, వివిధ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్‌కు వచ్చే వారిలో మొదటి, చివరి మైలు కోసం ‘ఫీడర్’ వాహనాలుగా ఈ–బైక్‌లను ఇష్టపడతారని అధ్యయనంలో తేలింది.
సైకిల్ ట్రాక్స్ అవసరం...
సుమారుగా 10కిలో మీటర్ల వరకు ప్రయాణించే వారి ఆలోచనలో మార్పు వస్తుంది. సైకిలింగ్‌పై చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగం, ఇంటి వద్ద వివిధ రకాల పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇటువంటి వారు ఈ–సైక్లింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. నగరంలో భారీ సంఖ్యలో మోటారు సైకిళ్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ–సైకిళ్లు, ఈ–బైకుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. దీంతో ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని సోలార్ సైక్లింగ్ మార్గాన్ని జీహెచ్‌ఎంసీ నిర్మించింది. కేబీఆర్ పార్కు చుట్టూ సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటైంది. అయినా వాటిపై వాహనాలను పార్కింగ్ చేయడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అనుకున్న లక్ష్యానికి ఆటంకంగా ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ ట్రాక్‌ల పర్యవేక్షణపై అధికారులు శ్రద్ధ వహించాలని పలువురు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment