Gangula Kamalakar: IT and ED Raids On Telangana Minister House
Sakshi News home page

మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు

Published Wed, Nov 9 2022 2:18 PM | Last Updated on Wed, Nov 9 2022 3:43 PM

IT, ED searches in Minister Gangula Kamalakar Residence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికలు ముగియగానే తెలంగాణలో ఐటీ, ఈడీ సోదాలు ఊపందుకున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇన్‌కమ్‌టాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని మంకమ్మతోట కాలనీలో ఉండే మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లోకి వచ్చిన అధికారులకు తాళాలు వేసి కనిపించాయి.

గంగుల కమలాకర్‌ విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. మంత్రి గంగుల కమలాకర్ అందుబాటులో లేకపోవడంతో తాళాలను డ్రిల్ మిషన్‌తో పగులగొట్టి అధికారులు ఇంట్లోకి వెళ్ళారు. గ్రానైట్‌ వ్యాపారంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలిసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటాయించిన మైన్లలో అనుమతికి మించి మైనింగ్ చేపట్టారన్న ఫిర్యాదులున్నాయి. వీటిలో జరిగిన అక్రమాలపై ఐటీ, ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే శ్వేతా ఏజన్సీ, ఏఎస్‌యూవై షిప్పింగ్, జేఎమ్‌ బాక్సీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్‌, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్‌ఆర్‌ ఏజన్సీస్, కేవీఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌కు నోటీసులు ఇచ్చారు. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాంతో పాటు ఆదాయపన్ను ఎగవేతలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది.

చదవండి: (గవర్నర్‌ Vs టీఆర్‌ఎస్‌: తమిళిసై ప్రెస్‌మీట్‌ వేళ ట్విస్ట్‌ ఇచ్చిన సర్కార్‌)

మంత్రి గంగుల కమలాకర్ సోదరుడు గంగుల వెంకన్న ఇంట్లో కూడా ఈడి సోదాలు నిర్వహిస్తోంది. ఆయన శ్వేతా గ్రానైట్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే వీరందరికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు హైదరాబాద్‌లో పంజాగుట్టలో ఉండే పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలోని కొన్ని ఫ్లాట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలోని గ్రానైట్‌ వ్యాపారి శ్రీధర్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement