సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయపరమైన చర్చకు దారి తీశాయి. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు అర్ధరాత్రి దాకా జరగ్గా.. శుక్రవారం ఉదయం కూడా అవి కొనసాగుతున్నాయి.
పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు నిన్న అర్ధరాత్రి దాకా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఉదయం మరోసారి చేపట్టారు. నార్సింగ్‌లోని ఇంటితో పాటు మదాపూర్‌లోని కేఎల్‌ఆర్ హెడ్‌క్వార్టర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి.
బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఇంట అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడి నిన్న ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment