ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే
పాల్గొన్న సీఎం రేవంత్, మండలి చైర్మన్, మంత్రులు
తెలంగాణ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర నాలుగో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ప్రజలకు కొత్త గవర్నర్ సందేశం
విభిన్న సంస్కృతులు, సుసంపన్నమైన వారసత్వం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచి్చన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సందేశాన్ని విడుదల చేశారు. సమృద్ధిగా సహజ వనరులు, సారవంతమైన వ్యవసాయ భూములతోపాటు వ్యాపార, వాణిజ్యానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు. యంగ్ అండ్ డైనమిక్ సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేశారు.
ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ వంటి విలువలతో కూడిన మన రాజ్యాంగం నిర్దేశించిన బాటలో కలిసి నడుస్తూ మార్పు దిశగా ప్రయాణాన్ని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. యువత, విద్య, సాధికారత, ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్య అంశాలుగా తీసుకుంటామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను ప్రశంసించారు.
విమానాశ్రయంలో ఘనస్వాగతం: శంషాబాద్: ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమానాశ్రయంలో గవర్నర్‌కు పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సాయుధ దళాలు గౌరవవందం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment