ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కారు నిర్ణయం
జాబ్ క్యాలెండర్‌ను నమ్ముకున్న అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి 11 వరకు గడువు ఉంది. దీంతో కనీసం రెండు నెలల తర్వాతే.. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను నమ్ముకుని.. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
నిలిచిన నోటిఫికేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల వరకు భర్తీ చేయనున్న ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఏయే నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. వీటిల్లో ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి. అయితే, అవి విడుదల కాలేదు.
జనవరి 11 వరకూ గడువు..
జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ ఈనెల 11న బాధ్యతలు స్వీకరించింది. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వనుంది.
జనవరి 11 వరకు ఈ కమిషన్‌కు గడువు ఉంది. మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని బట్టి చూస్తే కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఓ స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment