బ్యారేజీల ప్లానింగ్‌ ఏంటి.. డిజైన్లేంటి? | Sakshi
Sakshi News home page

బ్యారేజీల ప్లానింగ్‌ ఏంటి.. డిజైన్లేంటి?

Published Sun, May 12 2024 4:49 AM

Kaleswaram Inquiry Commission Chairman Justice Pinaki Chandraghose questions

కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ప్రశ్నలు

తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు?

బ్యారేజీ పూర్తయ్యాక తొలి వరదలకే దెబ్బతింటే రిపేర్లు ఎందుకు చేయలేదు?

లిఖిత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు ఆదేశం

కమిషన్‌ విచారణ కోసం స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సర్కారుకు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు? ప్లానింగ్‌ ఏమిటి? డిజైన్లు ఎవరు తయారు చేశారు? మోడల్‌ స్టడీస్‌ చేశారా? డిజైన్లకు తగ్గట్టే నిర్మాణం జరిగిందా? తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు? అక్కడ అదనంగా నీటి లభ్యత ఉందని ఎలా నిర్ధారించారు? బ్యారేజీలు ఆ ప్రాంతాల్లోనే కట్టాలని చెప్పిందెవరు? నిపుణుల నివేదిక ఉందా?’’ అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. 

శనివారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తమ కార్యాలయానికి నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును పిలిపించి ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతను నిర్థారించే హైడ్రాలజీ నివేదికలు అందించాలని కోరారు. ఇక ‘‘నీటి లభ్యతపై కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన తొలి వరదలకే వాటికి నష్టం జరిగితే ఎందుకు మరమ్మతులు జరపలేదు?’’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.

లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఆదేశం
నిర్మాణం పూర్తికాక ముందే బ్యారేజీలు పూర్తయినట్టు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని.. డిఫెక్ట్‌ లయబిలిటీ గడువు పూర్తికాకుండానే సెక్యూరిటీ డిపాజిట్లను ఎందుకు కాంట్రాక్టర్‌కు విడుదల చేశారని విచారణ కమిషన్‌ చైర్మన్‌ ప్రశ్నించారు. ‘‘డిఫెక్ట్‌ లయబులిటీ కాలంలోనే బ్యారేజీలకు నష్టాలు జరిగినా కాంట్రాక్టర్లతో మరమ్మతులు ఎందుకు చేయించలేదు? బ్యారేజీల వైఫల్యానికి కారణం నిర్మాణ లోపాలా? డిజైన్లలో లోపాలా? నిర్వహణ, పర్యవేక్షణ లోపాలా?

ప్రమాణాల మేరకు.. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులను వరిశీలించారా?’’ అని నిలదీసినట్టు తెలిసింది. వీటన్నింటిపై అంశాల వారీగా నల్లా వెంకటేశ్వర్లు సమాధానాలు ఇవ్వగా.. వివరాలన్నీ లిఖితపూర్వకంగా సమర్పించాలని జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆదేశించినట్టు సమాచారం.

విచారణ కోసం స్వతంత్ర కమిటీకాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ, నిర్వహణ లోపాలు, కారణాలను వెలికితీయడంతోపాటు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిషన్‌కు సహకారం అందించడానికి వీలుగా నిపుణులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

నీటి పారుదల శాఖతోగానీ, ఏ రాజకీయ పార్టీ లేదా ఏ సంఘంతోగానీ సంబంధం లేని నిపుణులను కమిటీలో నియమించాలని సూచించారు. కాగా.. చంద్రఘోష్‌ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఆదివారం కోల్‌కతాకు వెళ్లను న్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై కమిషన్‌ ఫిర్యా దుల స్వీకరణ ఈనెల 31వ తేదీతో ముగియనుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement