
ఈడీ విచారణకు హాజరయ్యేముందు తన పాత ఫోన్లను మీడియాకు చూపిస్తున్న ఎమ్మెల్సీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ స్వాధీనం చేసుకోవడం, అదీ ఒక మహిళ దగ్గర నుంచి తీసుకోవడం గోప్యతకు భంగం కలిగించినట్లు కాదా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తనని ప్రశ్నించకుండా ఇతరుల స్టేట్‌మెంట్లను బట్టి ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారని తప్పుబట్టారు.
ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌కు మంగళవారం కవిత లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో పది ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం విచారణకు ఆయా ఫోన్లతో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.
లేఖలోని సారాంశం...
‘‘దర్యాప్తు సంస్థ చర్యలు దుర్వినియోగంగా ఉన్నప్పటికీ తదుపరి విచారణల్లో సహకరించడానికి మీరు కోరిన విధంగా గతంలో వినియోగించిన ఫోన్లన్నీ అందిస్తున్నాను. నా హక్కులకు భంగం కలిగిస్తున్నా ఎలాంటి పక్షపాతం లేకుండా అందజేస్తున్నా.
అయితే మహిళకు సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకోవడమంటే గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా, నవంబర్ 2022లో పలువురు నిందితుల విచారణలో ఫోన్లు ధ్వంసమయ్యాయని స్టేట్‌మెంట్ ఇస్తే, దీన్ని నాకు కూడా ఆపాదిస్తూ చేసిన అసంబద్ధ ఆరోపణలను ప్రశ్నలించాలనుకుంటున్నా.
నాకు సమన్లు జారీ చేయకుండా, నన్ను ప్రశ్నించకుండా దర్యాప్తు సంస్థ ఈ విధమైన ఆరోపణలు ఎలా చేస్తుంది? తొలిసారిగా మార్చి 2023లో విచారణ నిమిత్తం నాకు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబర్‌లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఆరోపించడం దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం కాదా? వాస్తవాలకు విరుద్ధంగా లీకులు ఇవ్వడం వల్ల రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు.
తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడంతోపాటు నా పరువు, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి ఈడీ వంటి ఉన్నతమైన దర్యాప్తు సంస్థ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరం.
దీంతో నాపై వ్యతిరేక అభిప్రాయాలు సృష్టించడానికి దర్యాప్తు సంస్థ చేస్తున్న యత్నాలను తిప్పికొట్టడానికి నా ఫోన్లన్నీ స్వాధీనం చేస్తున్నా’’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొన్నారు. నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఐఎంఈఐ నంబర్లు అతికించిన ఫోన్లు మీడియా ముందు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment