కేసీఆర్‌ ఢిల్లీ రూట్‌! | Kcr to Leave on a 10-Day Tour of Country for National Politics | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఢిల్లీ రూట్‌!

Published Fri, May 20 2022 1:20 AM | Last Updated on Fri, May 20 2022 9:36 AM

Kcr to Leave on a 10-Day Tour of Country for National Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ దిశగా తాము కీలకపాత్ర పోషిస్తామని పలుమార్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చిన ఆయన.. శుక్రవారం నుంచి వివిధ రాష్ట్రాల పర్యటనలతో పోరుకు సిద్ధమవుతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్‌.. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటన ద్వారా జాతీయ రాజకీయాల్లో రోడ్‌ మ్యాప్‌కు అవసరమైన కసరత్తు చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్, పలువురు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో చర్చించి.. మే 20వ తేదీ నుంచి అనుసరించాల్సిన షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మేరకు విస్తృత పర్యటనలు చేపట్టాలని.. జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అంతేగాకుండా గల్వాన్‌లో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను, కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. 

వ్యూహాత్మకంగానే.. 
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలనే డిమాండ్‌ వస్తోందని గత నెల 27న జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా కేసీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఉత్తరాది రాష్ట్రాల పర్యటన చేపడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల పర్యటనలు పూర్తి చేసి.. తద్వారా వచ్చే స్పందన మేరకు కేసీఆర్‌ తదుపరి కార్యాచరణ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. 

ఢిల్లీ నుంచి మొదలుపెట్టి.. 
సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్ష, కక్షపూరిత వైఖరి, దేశంలో పెచ్చుమీరుతున్న మతోన్మాదం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులు, ప్రతినిధులతో కూడా కేసీఆర్‌ భేటీ కానున్నారు. 

– 22న మధ్యాహ్నం కేసీఆర్‌ చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా అందించేందుకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌లతో కలిసి కేసీఆర్‌ ఈ చెక్కుల పంపిణీని చేపట్టనున్నారు. ఇందులో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతు కుటుంబాలు ఆర్థికసాయం అందుకోనున్నాయి. 
– 26న ఉదయం సీఎం కేసీఆర్‌ బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో సమావేశమై జాతీయ, ప్రాంతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. 
– కేసీఆర్‌ 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీకానున్నారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని.. హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 
– ఈ నెల 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో కేసీఆర్‌ పర్యటించనున్నారు. గల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి.. గతంలో ప్రకటించిన మేరకు ఆర్ధికసాయం అందించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement