ఎండీ లక్ష్మీనారాయణతోపాటుఇతర డైరెక్టర్ల పేర్లు తెరపైకి
గోలమారి ఆంథోనిరెడ్డి,పూర్ణచందర్‌రావు సండు ఇతరులు
అందినకాడికి దోచుకున్నట్టు కీలక ఆధారాలు
ఈడీ దర్యాప్తులో లక్ష్మీనారాయణ నుంచి కీలక సమాచారం
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రీలాంచ్ స్కాంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణతోపాటు కంపెనీ డైరెక్టర్లు సైతం అందినకాడికి దండుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను సోమవారం నుంచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1,800 మంది కస్టమర్ల నుంచి రూ. 2 వేల కోట్ల మేర వసూలు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆ సొమ్మును ఏఏ కంపెనీల్లోకి మళ్లించారన్న దానిపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.
ఇదే అంశంపై లక్ష్మీనారాయణను గురువారం కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. గత 3 రోజులుగా ఈడీ సేకరించిన సమాచారం మేరకు లక్ష్మీనారా యణతోపాటు మరికొందరు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో లక్ష్మీనారాయణ సోదరుడు హరిబాబు, గోలమారి ఆంథోనిరెడ్డి, అతడి కుమారుడు అక్షయ్‌రెడ్డి, సతీశ్ చుక్కపల్లి, లక్ష్మీనారాయణ భార్య పార్వతి, లక్ష్మీనారాయణ కుమారుడు సాతి్వక్, పూర్ణచందరరావు సండులు సైతం డైరెక్టర్లుగా కొనసాగారు.
ఈ భారీ కుంభకోణంలో లక్ష్మీనారాయణ తర్వాత కీలక పాత్రధారులుగా గోలమారి ఆంధోనిరెడ్డి, పూర్ణచందర్‌రావులు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. దీంతో చివరిరోజు మరిన్ని కీలక అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.
నేతల పేర్లు చెప్పి రూ. కోట్లు పక్కదారి పట్టించిన ఆంథోనిరెడ్డి?
కీలక నిందితుల్లో ఒకరిగా ఈడీ అనుమానిస్తున్న గోలమారి ఆంథోనిరెడ్డి నాయకుల పేర్లు చెప్పి కమీషన్ల పేరిట పదుల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సాహితీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు కావాల్సిన అనుమతులు ఇప్పిస్తానని ఇద్దరు నేతల కోసమని రూ.40 కోట్ల మేర తీసుకున్నట్టుగా తెరపైకి వచ్చినట్టు సమాచారం.
హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం కొందరు అధికారులకు ఇవ్వాలంటూ రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఆంథోనిరెడ్డి తన కుమారుడు అక్షయ్‌రెడ్డిని సైతం డైరెక్టర్‌గా పెట్టి అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరో డైరెక్టర్ పూర్ణచందర్‌రావు సైతం పెద్ద మొత్తంలోనే డబ్బులు దండుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
బ్రోకర్ల ద్వారా అడ్డగోలుగా వసూళ్లు
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట పెద్ద ఎత్తున మోసాలకు తెర తీసేందుకు కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణతోపాటు ఇతర డైరెక్టర్లూ వారికి నచ్చిన విధంగా బ్రోకర్లను నియమించుకొని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో కొందరు ఎన్‌ఆర్‌ఐలను సైతం ఈ కుంభకోణంలోకి లాగేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. కొందరు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కంపెనీ లెక్కల్లోకి చూపకుండా కొందరు ఇష్టారీతిన వాడుకున్నట్టు సమాచారం.
డొల్ల కంపెనీల్లోకి డబ్బుల మళ్లింపు
ప్రీలాంచ్ పేరిట వసూలు చేసిన డబ్బును దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీలను సృష్టించారు. ఒక కంపెనీలో ఉన్నవారే మరో కంపెనీలో డైరెక్టర్లుగా, భాగస్వాములుగా వీటిని ఏర్పాటు చేసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment