khilashapur fort renovation over rs 1 crore sanctioned by telangana - Sakshi
Sakshi News home page

రూ.26 లక్షలతో అయ్యేది.. రూ.1.26 కోట్లకు తెచ్చారు

Published Fri, Jan 29 2021 10:48 AM | Last Updated on Fri, Jan 29 2021 1:27 PM

Khilashapur Fort Renovation Over Rs 1 Crore Sanctioned Telangana - Sakshi

గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తేవటమంటే ఇదే. బీటలు పెద్దవి అయినప్పుడు రూ.26 లక్షలతో మరమ్మతు చేద్దామనుకుని నిర్లక్ష్యం చేశారు. తీరా గోడ కూలిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణానికి రూ.1.26 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల ఆ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పురావస్తు శాఖ ఇంజినీరింగ్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే రూ.కోటి మిగిలి ఉండేది. ఈ కోట గోడను మెరుగుపరిచేందుకు మూడేళ్ల క్రితమే రూ.4 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులే జరగటం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలకు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు పనులు జరగాలి. కానీ ఇక్కడ ఆ వూసే లేదు. కోటకు మరిన్ని బీటలు ఏర్పడ్డాయి. ఇలాగే పురావస్తు శాఖ ఇంజినీరింగ్‌ విభాగం కళ్లుమూసుకుని ఉంటే తదుపరి వానలకు మరిన్ని చోట్ల గోడ కూలటం ఖాయంగా కనిపిస్తోంది.      – సాక్షి, హైదరాబాద్‌

 

ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా ఖిలాషాపూర్‌ గ్రామంలోని సర్వాయి పాపన్న కోట గోడ. గతేడాది సెప్టెంబర్‌లో గోడ పగుళ్లిచ్చింది. గతంలో చిన్నగా మొదలైన పగులు ఇలా పెరిగిపోయింది. దీంతో గోడకు దగ్గరగా ఇళ్లున్నవారు అది కూలితే ప్రమాదమని ఆందోళన చెంది ఫిర్యాదు చేయటంతో పురావస్తు (హెరిటేజ్‌) శాఖ అధికారులు వచ్చి దానికి మరమతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.26 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు.

అధికారులు అంచనా వేసిన నెల తర్వాత కుప్పకూలింది. గోడ కూలకుండా వెంటనే తాత్కాలిక చర్యలు తీసుకోవాల్సిన పురావస్తు ఇంజినీరింగ్‌ విభాగం నిర్లక్ష్యంతో కాలయాపన చేసిన ఫలితమిది. తొలుత తాత్కాలిక చర్యలు తీసుకుని, వానాకాలం ముగిసిన తర్వాత పూర్తిస్థాయి మరమ్మతు చేస్తే సరిపోయేది. కానీ, నెల రోజుల వరకు పట్టించుకోకపోవటంతో గత అక్టోబరులో కురిసిన పెద్ద వర్షానికి పగుళ్లలోంచి నీళ్లు లోపలికి పోయి గోడ ఇలా కుప్పకూలింది.  

కూలేంతవరకు ఎదురు చూస్తారా? 
తెలంగాణలోని పల్లెల్లో ఆకట్టుకునే బురుజులు చాలానే ఉన్నాయి. వాటిని తన ఆధీనంలోకి తీసుకొస్తే నిర్వహణ భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ బురుజులను పురావస్తుశాఖ గుర్తించట్లేదు. ఫలితంగా మరమ్మతులు, నిర్వహణ పనులు లేక ఇవి శిథిలమవుతున్నాయి. ఇది మెదక్‌ జిల్లా గుమ్మడిదల గ్రామంలో కళాత్మకంగా నిర్మించిన బురుజు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కానీ దానిపై మొలిచిన మొక్కలు క్రమంగా వేళ్లూనుకుంటూ కట్టడాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అధికారులు పరిరక్షణ చర్యలను విస్మరించడంతో క్రమంగా ధ్వంసమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement