Sarvayi papanna gaud
-
నిర్లక్ష్యం ఖరీదు కోటి రూపాయలు!
గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తేవటమంటే ఇదే. బీటలు పెద్దవి అయినప్పుడు రూ.26 లక్షలతో మరమ్మతు చేద్దామనుకుని నిర్లక్ష్యం చేశారు. తీరా గోడ కూలిన తర్వాత ఇప్పుడు పునర్నిర్మాణానికి రూ.1.26 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల ఆ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే రూ.కోటి మిగిలి ఉండేది. ఈ కోట గోడను మెరుగుపరిచేందుకు మూడేళ్ల క్రితమే రూ.4 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులే జరగటం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలకు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు పనులు జరగాలి. కానీ ఇక్కడ ఆ వూసే లేదు. కోటకు మరిన్ని బీటలు ఏర్పడ్డాయి. ఇలాగే పురావస్తు శాఖ ఇంజినీరింగ్ విభాగం కళ్లుమూసుకుని ఉంటే తదుపరి వానలకు మరిన్ని చోట్ల గోడ కూలటం ఖాయంగా కనిపిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ఫొటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలోని సర్వాయి పాపన్న కోట గోడ. గతేడాది సెప్టెంబర్‌లో గోడ పగుళ్లిచ్చింది. గతంలో చిన్నగా మొదలైన పగులు ఇలా పెరిగిపోయింది. దీంతో గోడకు దగ్గరగా ఇళ్లున్నవారు అది కూలితే ప్రమాదమని ఆందోళన చెంది ఫిర్యాదు చేయటంతో పురావస్తు (హెరిటేజ్) శాఖ అధికారులు వచ్చి దానికి మరమతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.26 లక్షలు ఖర్చవుతాయని అంచనా వేశారు. అధికారులు అంచనా వేసిన నెల తర్వాత కుప్పకూలింది. గోడ కూలకుండా వెంటనే తాత్కాలిక చర్యలు తీసుకోవాల్సిన పురావస్తు ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంతో కాలయాపన చేసిన ఫలితమిది. తొలుత తాత్కాలిక చర్యలు తీసుకుని, వానాకాలం ముగిసిన తర్వాత పూర్తిస్థాయి మరమ్మతు చేస్తే సరిపోయేది. కానీ, నెల రోజుల వరకు పట్టించుకోకపోవటంతో గత అక్టోబరులో కురిసిన పెద్ద వర్షానికి పగుళ్లలోంచి నీళ్లు లోపలికి పోయి గోడ ఇలా కుప్పకూలింది. కూలేంతవరకు ఎదురు చూస్తారా? తెలంగాణలోని పల్లెల్లో ఆకట్టుకునే బురుజులు చాలానే ఉన్నాయి. వాటిని తన ఆధీనంలోకి తీసుకొస్తే నిర్వహణ భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ బురుజులను పురావస్తుశాఖ గుర్తించట్లేదు. ఫలితంగా మరమ్మతులు, నిర్వహణ పనులు లేక ఇవి శిథిలమవుతున్నాయి. ఇది మెదక్ జిల్లా గుమ్మడిదల గ్రామంలో కళాత్మకంగా నిర్మించిన బురుజు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కానీ దానిపై మొలిచిన మొక్కలు క్రమంగా వేళ్లూనుకుంటూ కట్టడాన్ని ధ్వంసం చేస్తున్నాయి. అధికారులు పరిరక్షణ చర్యలను విస్మరించడంతో క్రమంగా ధ్వంసమవుతోంది. -
సమాజ శ్రేయస్సు కోసం...
పి.చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో జైహింద్ గౌడ్ హీరోగా నటిస్తూ, నిర్మించనున్న సినిమా ‘సర్వాయి పాపన్నగౌడ్’. ఈ నెల 19న హుస్నాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘మన రాజకీయ నాయకుల బ్రష్టు పట్టిన విధానాలను ప్రక్షాళన చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. సమాజ శ్రేయస్సు కోసం మంచి సినిమా ఇవ్వాలనే ఆకాంక్షతో చేస్తున్నాం’’ అని జైహింద్ గౌడ్ తెలిపారు. ‘‘దర్శకుడిగా ఇది నా 90వ సినిమా. చారిత్రక కథాంశంతో ఫ్యామిలీ, యూత్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కథ: శమంత, మాటలు-పాటలు: విష్ణుశ్రీ, కెమేరా: కంకణాల శ్రీనివాసరెడ్డి.