ఆరేళ్లుగా కొనసాగుతున్న 50 గదుల నిర్మాణం పనులు
కొనసాగుతున్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణం
ప్రతి ఏడాది జాతర సమయంలో ఇబ్బందులు పడుతున్న భక్తులు
త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి వినతి
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి. ప్రతి ఏడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. ఈ దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పట్నం, బోనం, స్వామి వారికి మొక్కులు చెల్లిస్తుంటారు. మరో మూడు నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో రోజుకు 30 వేలకు పైగా, సాధారణ సమయంలో ఆదివారం, బుధవారాల్లో 20 వేలకు పైగా భక్తులు వస్తుంటారు.
ఆరేళ్లుగా కొనసాగుతున్న గదుల నిర్మాణం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ పరిసరాల్లో దాతల సహకారంతో 128 గదులు కొన్నేళ్ల కిందట నిర్మించారు. అందులో 18 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక మిగిలినవి 110 గదులు మాత్రమే. అందులో నుంచే జాతర సమయంలో పోలీసులకు, ఇతర అవసరాలకు దాదాపు 50 వరకు వినియోగిస్తారు. ఇక 60 గదులే భక్తులకు అందుబాటులో ఉంటాయి. జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. బుధ, ఆదివారాల్లో రోజుకు 50 వేలకు పైగా మిగతా రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమయంలో ప్రైవేట్ అద్దె గదుల యజమానులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఒక్కో గదికి 12 గంటలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించలేని భక్తులు చెట్ల కిందనే బోనం వండి దేవాలయంలో బోనం, పట్నం చెల్లిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో 2018 సంవత్సరంలో 50 గదుల నిర్మాణంను ప్రారంభించారు. రూ.10.65 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టుతో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి పనులు ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. ఆరేళ్లు పూర్తవుతున్నా ఇంకా గదుల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఈ జాతరకు అందుబాటులోకి వచ్చేలా చేసి, ఇంకా 150కి పైగా గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.
క్యూ కాంప్లెక్స్ పూర్తయ్యేనా?
మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కర్రలతో క్యూలైన్‌లను ప్రతి జాతర సమయంలో ఏర్పాటు చేస్తారు. దర్శనానికి బుధ, ఆదివారాల్లో 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి క్యూలైన్‌లో ప్రవేశిస్తే మళ్లీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.
వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, చిన్నారులు మూత్రంకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల వినతుల మేరకు క్యూ కాంప్లెక్స్‌లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులను 2023, అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు స్లాబ్‌లు వేశారు. లోపల క్యూలైన్‌లు, మూత్రశాలలు నిర్మించాలి.
జాతర నాటికి పనులు పూర్తయ్యేనా?
మరో మూడున్నర నెలల్లో స్వామి వారి కల్యాణంతో జాతర ప్రారంభం కానుంది. ఉగాది వరకు జాతర జరగనుంది. జాతర సమయంలో రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరిగితేనే జాతర నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే భక్తుల ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
పూర్తయ్యేందుకు కృషి చేస్తాం
క్యూ కాంప్లెక్స్‌కు మూడు స్లాబ్‌లు వేశాం. 50 గదుల నిర్మాణం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వారు చేస్తున్నారు. ఈ జాతర నాటికి పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– బాలాజీ, ఈఓ
Comments
Please login to add a commentAdd a comment