
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వెండి కాంతులతో ధగధగలాడుతోంది. భక్తులు హుండీలో వేసిన వెండి కోరమీసాలు, తొట్టెలు, బాసింగాలను కరిగించి ఆలయంలోని మూడు ద్వారాలు, తలుపులకు వెండిరేకులతో తాపడం చేయించారు.
మూడు నెలలు శ్రమించి..
భక్తులు మల్లికార్జునుడికి వెండి కోరమీసాలు సమర్పిస్తుంటారు. పెళ్లి అయిన తర్వాత వెండి బాసింగాలు చెల్లించడం, పిల్లలు పుడితే వెండి తొట్టెలను అందిస్తానని మొక్కుకోవడం ఆనవాయితీ. ఇలా కోర్కెలు తీరిన తర్వాత భక్తులు హుండీలో వేసిన వెండి 786.655 కిలోలకు చేరింది. ఈ కానుకలను కరిగించగా 615.454 కిలోల వెండి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆలయ ద్వారాలు, తలుపులకు వెండి తాపడం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ద్వారా ఈ పనులను తిరుపతికి చెందిన బాలాజీ మెటల్ వర్క్స్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ మూడు నెలల పాటు శ్రమించి 493 కిలోల వెండితో మూడు ద్వారాలు, తలుపులకు తాపడం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment