అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన సినీ పరిశ్రమ
నాగార్జున ఫ్యామిలీ, సమంతకు చిరంజీవి, వెంకటేష్, మహేష్బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ తదితరుల బాసట
సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామన్న ‘మా’
సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. ఈ మేరకు కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.
తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాష నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, మహేష్బాబు, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేష్, నాని, విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు.
నాగార్జున పరువునష్టం దావా..
మంత్రి సురేఖపై సినీనటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... సీఎం రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment