అడ్డగోలు సెస్‌లతో రాష్ట్రాలకు అన్యాయం: మంత్రి కేటీఆర్‌  | KTR Comments On About Cess Video Conference With Cms And Finance Ministers | Sakshi
Sakshi News home page

అడ్డగోలు సెస్‌లతో రాష్ట్రాలకు అన్యాయం: మంత్రి కేటీఆర్‌ 

Published Tue, Nov 16 2021 4:02 AM | Last Updated on Tue, Nov 16 2021 8:33 AM

KTR Comments On About Cess Video Conference With Cms And Finance Ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:      ‘రోజు రోజుకూ పెరుగుతున్న సెస్‌లతో ‘డివిజబుల్‌ పూల్‌’ (విభజించదగిన మొత్తం)మరింతగా కుంచించుకుపోతోంది. 1980లో కేంద్రం పన్ను రాబడిలో 2.3 శాతం మాత్రమే ఉన్న సెస్‌లు 2021లో 20 శాతానికి చేరుకున్నాయి. కొన్నిసార్లు ప్రాథమిక ధరలకంటే సెస్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విపరీత పోకడలను హేతుబద్ధీకరిస్తే, రాష్ట్రాలు పన్నుల పంపిణీ ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోగలుగుతాయి..’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు.

కేంద్రం రూపొందించే విధానాల అమలు బాధ్యత రాష్టట్రాలదేనని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా అధికార వికేంద్రీకరణ జరగాలని అన్నారు. పన్ను పంపిణీ ద్వారా రాష్ట్రాలకు మరింత డబ్బు అందించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం జరిపారు. 

రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని పెంచేందుకు వీలుగా ఈ నెల 22న మొత్తం రూ.95,082 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మూలధన వ్యయాన్ని పెంచాలని కొందరు ముఖ్యమంత్రులు కోరినట్లు చెప్పారు. కాగా ప్రగతి భవన్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని స్పష్టం చేశారు.   

రూ.900 కోట్లు వెంటనే ఇవ్వాలి 
‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాలి. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు రెండు విడతలుగా చెల్లించాల్సిన రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫారసులు వెంటనే అమలు చేయాలి..’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.  

ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచాలి... 
‘కోవిడ్‌కు ముందు 2018 మొదటి త్రైమాసికం నుండి సుమారు 8 వరుస త్రైమాసికాల పాటు ఆర్థికాభివృద్ధి మందగించింది. 2011–12 లో జీడీపీలో పెట్టుబడి శాతం 39 శాతంగా ఉండగా, 2021–22  నాటికి 29.3 శాతానికి తగ్గి దేశ ఆర్థిక స్థితిని కుంగదీస్తోంది. పెట్టుబడి శాతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. మూలధన వ్యయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలు జీఎస్డీపీలో 0.5 శాతం రుణాలను తీసుకోవచ్చుననే నిర్ణయం స్వాగతించదగ్గది. మూలధన ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి మాత్రమే రుణం తీసుకోవాలన్న నిబంధనను అనుసరిస్తాం. అందుకు ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 2 శాతానికి పెంచాలి..’ అని కోరారు.  

పెట్టుబడి రాయితీలివ్వాలి 
    ‘వస్త్ర పరిశ్రమ, దుస్తులు, బొమ్మలు, తోలు వస్తువులు, లైట్‌ ఇంజనీరింగ్‌ వస్తువులు, పాదరక్షలు వంటి రంగాల్లో పెట్టుబడి రాయితీలిస్తే, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. జీడీపీకి 30 శాతం చేయూత ఎంఎస్‌ఎంఈలే ఇస్తున్నాయి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను వీటికి కూడా వర్తింపజేయాలి. చిన్నస్థాయి నుండి మధ్యస్థానికి, మధ్యస్థం నుండి  భారీ స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందే సంస్థలకు వడ్డీ రాయితీని విస్తరించాలి..’ అని కేటీఆర్‌ సూచించారు.  

కాగితాలపైనే హామీలు 
    ‘ఆరు పారిశ్రామిక కారిడార్లను పదే పదే అడిగినా మంజూరు చేయలేదు. రక్షణ, ఎలక్ట్రానిక్స్, వస్త్ర, ఫార్మాస్యూటికల్స్‌ రంగాల ‘ఎకో సిస్టమ్‌’ తెలంగాణలో ఉన్నందున ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలి. ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పేపర్లకే పరిమితమయ్యాయి.  తెలంగాణకు సముద్రతీరం లేదు. డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశాలివ్వాలి. వచ్చే పదేళ్లలో అత్యధిక ఉద్యోగావకాశాలు సృష్టించనున్న వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఔషధ రంగాలను ప్రోత్సహించాలి. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు సావరిన్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్‌ను మూలధన పెట్టుబడిగా వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలి..’ అని కోరారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement