సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరంలేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
బుధవారం ఆయన కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ త్రివేణి, డాక్టర్ శివరామప్రసాద్, ఉస్మానియా, గాందీ, ఛాతీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావు, డాక్టర్ మహబూబ్ ఖాన్, టీస్‌ఎంఎస్‌ఐడీసీ సంచాలకులు కౌటిల్య, చీఫ్ ఇంజనీరు రాజేంద్ర కుమార్, స్పెషల్ ఆఫీసర్ రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారన్నారు.
జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్సకు అవసరమైన పరికరాలు, ఔషధాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడైనా కొరత ఉంటే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్ పెట్టి, వెంటనే ఆయా వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌ను వెంటనే పూర్తిచేయాలని, ఆస్పత్రుల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు అందజేయాలని సూచించారు.
ఈ 9 కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవు: తగినన్ని కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రులు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కి పంపాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ నెల 6వ తేదీ నుంచి బుధవారం వరకు తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ తొమ్మిది కేసుల్లో తీవ్రమైన లక్షణాలేమీ లేవని, బాధితులంతా హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 319 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ కేసుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై నిఘా పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా కేసులు
రాష్ట్రంలో బుధవారం మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు.
హైదరాబాద్ నగరంలోనే ఈ ఆరు కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది ఆస్పత్రుల్లో లేదా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.44 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో ఇప్పటివరకు 4,111 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారంతా రికవరీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment