![Liquor sales worth Rs 29648 crore in 2025: Telnagana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/BOTTLE11.jpg.webp?itok=yt7H4PzP)
ఈ ఏడాది ఇప్పటివరకు రూ.29,648 కోట్ల అమ్మకాలు
గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.1000 కోట్లు తక్కువ
2023–24లో జనవరినాటికి రూ.30,696 కోట్ల విలువైన అమ్మకాలు
2023 ఆగస్టులో మద్యం దుకాణాల దరఖాస్తుల కింద 2400 కోట్ల ఆదాయం
అది మినహాయిస్తే ఏడాది అమ్మకాలు గతేడాది కంటే రూ.1400 కోట్లు ఎక్కువే
ఈ ఆర్థిక సంవత్సరంలో 36 వేల కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్న ఎక్సైజ్ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలల వారీగా చూస్తే పెరుగుతూ.. తగ్గుతూ ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ప్రతి నెలా 10 శాతం మేరకు పడుతూ..లేస్తూ అమ్మకాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత 10 నెలల కాలంలో రూ.29,648 కోట్ల విలువైన మద్యం అమ్ముడైందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే 2023–24 ఆర్థిక సంవత్సరంలో 10 నెలల కాలంలో అమ్ముడైన మద్యం విలువ రూ. 30,696 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.1000 కోట్ల మేర మద్యం అమ్మకాలు తగ్గాయని అర్థమవుతోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/ppatika_0.jpg)
కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెలలో కొత్త మద్యం షాపులకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్ దరఖాస్తుల కింద రూ.2,400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని మినహాయిస్తే 10 నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు రూ.1400 కోట్ల మేర పెరిగాయని తెలుస్తోంది. ఇక, నెలల వారీగా చూస్తే రూ. 2700 కోట్ల నుంచి రూ.3300 కోట్ల మేరకు అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. కాగా గత ఏడాదిలో మొత్తం 12 నెలలకు రూ. 35,586 కోట్ల మేర మద్యం అమ్మకాలు రాష్ట్రంలో జరిగాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అమ్మకాలుంటాయని, వాటి విలువ రూ.36 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
(నోట్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల అమ్మకాల విలువను ఈ పట్టికలో లెక్కించలేదు. ఈ రెండు నెలలు కలిపి మొత్తం అమ్మకాల విలువ రూ.36వేల కోట్లకు పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.)
Comments
Please login to add a commentAdd a comment