![Maha Kumbh 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/011_4.jpg.webp?itok=07tliAxS)
ఉప్పల్/మలక్‌పేట: మహాకుంభ మేళాకు వెళ్లి తమవాళ్లు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారనుకున్న ఆ కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఆనందంతో బయలుదేరి విగత జీవులుగా మారి తిరిగి రావడం తీరని దుఃఖాన్నే మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన బాధితులు భోరుమంటూ విలపిస్తున్నారు. తాము కుశలమేనంటూ ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను పిండేసింది.
మహా కుంభ మేళా నుంచి మినీ బస్సులో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద ట్రక్కు ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురు నగర వాసులు మృత్యువాత పడ్డారు. నాచారం ప్రాంతానికి చెందిన ఆరుగురు, మూసారంబాగ్‌కు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు వెళ్లిన వారంతా స్నేహితులే కావడం గమనార్హం. కాగా.. మృత దేహాలు బుధవారం మధ్యాహ్నం వరకు నగరానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
బై బై అంటూ బయలుదేరి..
మూసారంబాగ్‌కు చెందిన గోల్కొండ ఆనంద్‌కుమార్ (47) ఇంటి నుంచి బయలుదేరే ముందు భార్యా పిల్లలకు బై బై అని చెప్పి కుంభ మేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఆనంద్ కుమార్ సలీంనగర్‌లో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. స్నేహితులతో కలిసి శనివారం ఉదయం నాచారం నుంచి మినీ బస్సులో కుంభమేళాకు బయలుదేరారు. త్రివేణి సంగమంలో స్నానం చేశామని, ట్రాఫిక్ జామ్ ఉందని, వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని, ట్రాఫిక్ క్లియర్ కావడానికి 24 గంటలు పడుతుందని, ఎవరూ రావొద్దని సోమవారం రాత్రి ఫోన్ చెసి చెప్పాడని బంధువులు తెలిపారు.
పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే..
భోరంపేట సంతోష్ భార్య గత ఏడాది క్రితం కన్నుమూశారు. బుధవారం ఆయన పెళ్లి రోజు. వచ్చే నెల్లో భార్య సంవత్సరీకం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు హాస్టల్‌లో ఉంటున్నారు. తన పెళ్లి రోజుకు ఒక్క రోజు ముందే భార్య వద్దకే వెళ్లిపోయాడంటూ కుటుంబీకులు విలపిస్తున్నారు.
బతుకు బండికి డ్రైవర్..
వృత్తిరీత్యా డ్రైవర్ అయిన కల్కూరి రాజు కుటుంబ పరిస్థితి దయనీయం. ఆయన డ్రైవింగ్ చేస్తేనే వారి ఇల్లు గడిచేది. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామని, అంతా రోడ్డునపడ్డామంటూ కుటుంబం విలపిస్తోంది. రాజు మరణ వార్త తెలియడంతోనే శ్రీరామ్ కాలనీ బస్తీ శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త లేడన్న వార్త తెలిసి రాజు భార్య మహేశ్వరి గుండెలు పగిలేలా రోదిస్తోంది.
కాలనీ సమస్యలపైనే దృష్టి
మా నాన్న అందరికి రోల్ మోడల్‌గా ఉండేవారు. అందరికీ సాయపడే వ్యక్తి ఆయన. అందరితో కలిసి మెలిసి ఉండే వారు. నిత్యం స్థానికులతోనే గడిపే వారు. కాలనీయే ఆయనకు సర్వస్వం. సోమవారం గంగ స్నానం అయిందంటూ మాట్లాడారు. తిరిగి వచ్చేస్తున్నా అని కూడా చెప్పాడు. కాని నాన్న ఇంక రాలేరు.
– మల్లారెడ్డి కుమారుడు శ్రావణ్ రెడ్డి
పిల్లలకేం చెప్పాలి.. దేవుడా..
‘నా కొడుకు పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వారికి ఇంకా తెలియదు. గత ఏడాది వారి తల్లి మృతి చెందింది. ఇప్పుడు తండ్రి కూడా చనిపోయాడు. పిల్లలు హాస్టల్ నుంచి వస్తే నేనేం సమాధానం చెప్పాలి దేవుడా’ అంటూ సంతోష్ తల్లి భోరున విలపిస్తోంది.
– విలపిస్తున్న సంతోష్ తల్లి
Comments
Please login to add a commentAdd a comment