ధర్మసాగర్: ‘నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం.. మాకు పెట్టే భోజనం కనీసం పశువులు కూడా తినడం లేదు.అంతకన్నా హీనమయ్యామా’అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, కళాశాలలో భోజనం మంచిగా లేదని, నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు గురువారం హైదరాబాద్–వరంగల్ రహదారిపై బైఠాయించారు.
విద్యార్థులు మాట్లాడుతూ మెనూతో సంబంధం లేకుండా కుళ్లిన కూరగాయలు వండుతున్నారని, సాంబారు పేరుతో చింతపండు పులుసుతో వేడి నీళ్లు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో కడుపు మాడ్చుకొని పడుకుంటున్నామని విలపించారు. బాత్ రూం పైపుల లీకేజీ వల్ల వచ్చే వాసన భరించలేకపోతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment