రసూల్‌పురా(హైదరాబాద్)/ఘట్‌కేసర్: తనపై దాడి వెనుక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తముందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్నందునే తన అనుచరులతో రెడ్డిసింహగర్జన సభలో తనపై దాడి చేయించారని అన్నారు. సోమవారం మంత్రి బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్‌పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా రేవంత్‌రెడ్డి తనను బ్లాక్‌మెయిల్ చేస్తు న్నారని, ఇదే విషయాన్ని గతంలో కూడా తాను చెప్పానని మల్లారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని, అయినా తాను భయపడనని చెప్పారు.
సింహగర్జన సభలో రెడ్డి సామాజిక వర్గానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా తనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారని.. చివరకు తనపై, తన కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసిరి దాడికి దిగారని తెలిపారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయంలో కరోనా కారణంగా జాప్యం జరిగిందని, ఇదే అంశాన్ని తాను సభా వేదికపై చెబుతున్న సమయంలోనే తన ప్రసంగానికి అడ్డుపడ్డారని మంత్రి తెలిపారు. తనమీద దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎంపీ రేవంత్‌రెడ్డి నేరాలపై విచారణ చేసి జైలులో పెడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, మేడ్చల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
మంత్రిపై దాడి చేసిన వారిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి జరిగిన రెడ్ల సింహగర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి సభావేదికపై మాట్లాడుతుండగా రేవంత్‌రెడ్డి అనుచరులైన మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి.. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ దుర్భాషలాడుతూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా మరికొందరు రేవంత్ అనుచరులు మంత్రి కాన్వాయ్‌పై నీళ్ల్లబాటిళ్లు, కుర్చీలతో దాడి చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఫిర్యాదు మేరకు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కేసులో ఏ1గా సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, ఏ2గా సోమశేఖర్‌రెడ్డి పేర్లను పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment