
చిన్నకోడూరు (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే మల్లారం నీటిశుద్ధి కేంద్రంలోని పంపుహౌస్ నీట మునిగింది. దీనితో హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గోదావరి నది నుంచి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే పథకంలో భాగమైన ఈ ప్లాంట్.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో ఉంది.
ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానతో వరద పోటెత్తి 9 పంపులు నీట మునిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే నీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై అధికారులు ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. పంపుహౌస్ నుంచి వరద నీటిని తోడేస్తున్నారు. దీని పునరుద్ధరణకు 3 రోజులకుపైగా పడుతుందని.. అప్పటివరకు ఆయా గ్రామాలకు నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ అధికారులు ప్రకటించారు.
ఆరు రోజుల్లో పూర్తిస్థాయి పంపింగ్..
మంత్రి హరీశ్‌రావు, జలమండలి ఎండీ దానకిశోర్ సోమవారం సోమవారం ఈ పంపుహౌస్‌ను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన దీనిని పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హరీశ్‌రావు చెప్పారు. రెండు రోజుల్లో తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేసి కొంతమేర నీటి సరఫరా ప్రారంభిస్తామని.. ఆరు రోజుల్లో పూర్తిస్థాయిలో పంపింగ్ చేపడతామని తెలిపారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడం వల్ల.. హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు. మల్లారం పంపుహౌస్ మునకతో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు.. హిమాయత్ సాగర్, గండిపేట, సింగూరు నుంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని చెప్పారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా..
మల్లారం పంపుహౌజ్ నుంచి వరద నీటిని తోడేసి, సరఫరా పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. సింగూరు, మంజీరా, హిమాయత్‌సాగర్, గండిపేటల నుంచి అదనంగా నీటిని తరలిస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్‌చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతంల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
చదవండి: Yellow, Orange, Red Alerts: ఎప్పుడు జారీ చేస్తారో తెలుసా?!
Comments
Please login to add a commentAdd a comment