mallaram
-
నీట మునిగిన పంప్‌హౌస్.. హైదరాబాద్‌తో పాటు ఇతర గ్రామాలకూ..
చిన్నకోడూరు (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే మల్లారం నీటిశుద్ధి కేంద్రంలోని పంపుహౌస్ నీట మునిగింది. దీనితో హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట, జనగాం, భువనగిరి, మేడ్చల్ పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గోదావరి నది నుంచి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే పథకంలో భాగమైన ఈ ప్లాంట్.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానతో వరద పోటెత్తి 9 పంపులు నీట మునిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే నీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై అధికారులు ఆగమేఘాలపై చర్యలు చేపట్టారు. పంపుహౌస్ నుంచి వరద నీటిని తోడేస్తున్నారు. దీని పునరుద్ధరణకు 3 రోజులకుపైగా పడుతుందని.. అప్పటివరకు ఆయా గ్రామాలకు నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ అధికారులు ప్రకటించారు. ఆరు రోజుల్లో పూర్తిస్థాయి పంపింగ్.. మంత్రి హరీశ్‌రావు, జలమండలి ఎండీ దానకిశోర్ సోమవారం సోమవారం ఈ పంపుహౌస్‌ను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన దీనిని పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హరీశ్‌రావు చెప్పారు. రెండు రోజుల్లో తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేసి కొంతమేర నీటి సరఫరా ప్రారంభిస్తామని.. ఆరు రోజుల్లో పూర్తిస్థాయిలో పంపింగ్ చేపడతామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రింగ్ మెయిన్ ఏర్పాటు చేయడం వల్ల.. హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు. మల్లారం పంపుహౌస్ మునకతో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు.. హిమాయత్ సాగర్, గండిపేట, సింగూరు నుంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని చెప్పారు. ట్యాంకర్లతో నీటి సరఫరా.. మల్లారం పంపుహౌజ్ నుంచి వరద నీటిని తోడేసి, సరఫరా పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. సింగూరు, మంజీరా, హిమాయత్‌సాగర్, గండిపేటల నుంచి అదనంగా నీటిని తరలిస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్‌పురి, మల్కాజిగిరి, పటాన్చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతంల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: Yellow, Orange, Red Alerts: ఎప్పుడు జారీ చేస్తారో తెలుసా?! -
ప్రమాదకరం.. మల్లారం మలుపులు
నిజామాబాద్ రూరల్ : చిన్న రోడ్డు కాస్త రహదారి వరకు పెంచి మంచి సౌకర్యమే కల్పించారు!. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం నుంచి మల్కాపూర్ గ్రామం వరకు గల బాన్సువాడ –నిజామాబాద్ రహదారిపై మలుపులు ప్రమాదకరంగా మారాయి. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మలుపుల వద్ద కనీసం సూచికలు కాని, హెచ్చరిక బోర్డులు గాని లేవు. దీంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కనీసం నెలకు నాలుగు ప్రమాదాలు అవుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఏడాదికి సగటున 15 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజామాబాద్– బాన్సువాడ మధ్య తిరిగే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మల్లారం గండిలో రోడ్డు ఇరుకుగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పది చోట్ల మలుపులు ఉన్నాయి. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తద్వారా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బైకులు, భారీ వాహనాలు సైతం ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదని రహదారి పరిసర గ్రామాలవాసులు ఆరోపిస్తున్నారు. మల్లారం, మల్కాపూర్, ముత్తకుంట, కొత్తపేట, ప్రజలు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి మల్లారం గండిలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. అధికారులు ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకో వాలి. ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నా రు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్డు మీద వెళ్లేవారికి ప్రమాదాలు కాకుండా చర్యలు తీసుకోవాలి. అటవీ ప్రాం తంలో నిఘా ఏర్పాటు చేయాలి. –మీసాల సువర్ణమధుకర్, సర్పంచ్ -
అన్నా.. జర అడ్రస్ చెప్పవే
►మన వీఆర్వో.. ఎక్కడుంటడే! ►కార్యాలయాలు లేక వీఆర్వోల ఇక్కట్లు ►చెట్ల కింద, అద్దె ఇళ్లలో విధులు ►రికార్డులను భద్రపరిచేందుకు నానా అగచాట్లు ►మండల కేంద్రాలకే పరిమితమవుతున్న అధికారులు ►ప్రతి చిన్న పనికి తహసీల్దార్ ఆఫీసులకే జనం పరుగు హైదరాబాద్: మల్లారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ.. 1,500 జనాభా ఉంటుంది.. ఊరికి వీఆర్వో ఉన్నారు.. అయితే ఆయనకు ఆఫీసు మాత్రం లేదు.. చేసేది లేక ఆ అధికారే నెలకు రూ.500 చొప్పున ఊళ్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆఫీసు నడుపుతున్నారు! కార్యాలయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అటు గ్రామస్తులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!!.. ఇది ఒక్క మల్లారంలో పరిస్థితే కాదు.. రాష్ట్రంలో చాలా గ్రామాల వీఆర్వోలు ఇవే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు లేక ఇంటిని అద్దెకు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నవారు కొందరైతే.. చెట్టు కింద, పాడుబడ్డ భవనాల్లో, మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో పనులు చేస్తున్నవారు మరికొందరు. ఆఫీసులు లేకపోవడంతో గ్రామంలోని భూములకు సంబంధించిన కీలక రికార్డులను భద్రపర్చడం కూడా కష్టమవుతోందని వీఆర్వోలు గోడు వెల్లబోసుకుంటున్నారు. పట్టించుకునేవారేరి..? కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టకపోవడంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థకు నిలువ నీడ లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్రంలోని 6,873 వీఆర్వోలు, 22,245 మంది వీఆర్ఏలు గ్రామంలో ఏదో ఒక పంచన కూర్చుని పనులు చక్కబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక వీఆర్వోకు అదనంగా ఐదారు గ్రామాల బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించడంతో కొన్ని సందర్భాల్లో ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం సాధ్యం కావడం లేదు. మండల తహశీల్దార్ కార్యాలయంలో కూర్చొని అన్ని గ్రామాల ప్రజలను అక్కడికే పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇక గ్రామంలోని భూములకు సంబంధించిన రికార్డులకూ రక్షణ కరువవుతోంది. దీంతో వాటన్నింటినీ మండల కేంద్రంలో భద్రపరచుకోవాల్సి వస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) కార్యాలయం నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలను వీఆర్వో కార్యాలయాలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అయినా క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లవుతున్నా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రయత్నం ప్రారంభించలేదు. మండల కార్యాలయాలకే పరిమితం గ్రామాల్లో ఉండాల్సిన గ్రామ రెవెన్యూ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయానికే పరిమితవుతున్నారు. తహశీల్దారు కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడం, పనిభారం అధికంగా ఉండడంతో.. కాస్తోకూస్తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్వోలతోనే తహశీల్దార్లు పనులను చేయించుకుంటున్నారు. రెవెన్యూ సేవలన్నింటినీ ప్రభుత్వం కంప్యూటరైజ్ చేయడం, వెబ్‌ల్యాండ్ డేటాను ఆన్లైన్లో ప్రతిరోజూ అప్డేట్ చేయాల్సి ఉండటంతో చాలామంది తహశీల్దార్లు ఆ పనులను వీఆర్వోలకు అప్పగిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ఆన్లైన్ ద్వారానే సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున తహశీల్దార్ కార్యాలయంలో ఉండాల్సి వస్తోందని వీఆర్వోలు చెబుతున్నారు. వీఆర్ఏల మాదిరే వీఆర్వోలను కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తిని నియమిస్తే మేలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గ్రామంలోనే రెవెన్యూ కార్యాలయం ఉంటే.. – గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రజలు చిన్నచిన్న అవసరాలకు మండల కేంద్రానికి వెళ్లే పని తప్పుతుంది – కార్యాలయం లేక, వీఆర్వో గ్రామానికి రాక ప్రతి పనికీ మండలాఫీసుకు వెళ్లి రావడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉన్న ఊళ్లోనే ఆఫీసు ఉంటే ప్రజలకు ప్రయాణ ఖర్చులు తప్పడంతోపాటు విలువైన సమయం వృథా కాకుండా ఉంటుంది – క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిని పూర్తవుతుంది. రైతులకు అవసరమైన పహానీ నకళ్లను అక్కడిక్కడే వీఆర్వో జారీ చేస్తారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు వీఆర్వో సిఫార్సు ఉంటేనే మండల తహశీల్దారు జారీ చేస్తారు – గ్రామంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సాయం కోసం వీఆర్వోనే ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయడం సులభతరం అవుతుంది – చెరువులు, భూములు, నాలాల రక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ సులువవుతుంది ఆఫీసులు ఉంటే సేవలు మరింత చేరువ ప్రతి గ్రామానికి రెవెన్యూ కార్యాలయం ఉంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుంది. అధికారి అందుబాటులో ఉంటే ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువవుతాయి. వివిధ పథకాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలించేందుకు వీలవుతుంది. రెవెన్యూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యాలయం ఉండాలని గత ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో చాలా గ్రామాల్లో వీఆర్వోలు ఇల్లు అద్దెకు తీసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తమ జేబు నుంచే అద్దె చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు నిర్మించాలి. – బాణాల రామిరెడ్డి, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
విష జ్వరంతో మహిళ మృతి
పాల్వంచ రూరల్(ఖమ్మం జిల్లా): పాల్వంచ మండలం ఉల్లనూరు పంచాయతీ మల్లారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలం సమ్మక్క(52) అనే మహిళ విష జ్వరంతో గురువారం ఉదయం మృతిచెందింది. ఐదు రోజులుగా సమ్మక్క జ్వరంతో బాధపడుతోంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నిన్న సాయంత్రం(బుధవారం) తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది.