అన్నా.. జర అడ్రస్‌ చెప్పవే | VRO’s face the Problems without offices | Sakshi
Sakshi News home page

అన్నా.. జర అడ్రస్‌ చెప్పవే

Published Mon, Jun 5 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

అన్నా.. జర అడ్రస్‌ చెప్పవే

అన్నా.. జర అడ్రస్‌ చెప్పవే

►మన వీఆర్వో.. ఎక్కడుంటడే!
►కార్యాలయాలు లేక వీఆర్వోల ఇక్కట్లు
►చెట్ల కింద, అద్దె ఇళ్లలో విధులు
►రికార్డులను భద్రపరిచేందుకు నానా అగచాట్లు
►మండల కేంద్రాలకే పరిమితమవుతున్న అధికారులు
►ప్రతి చిన్న పనికి తహసీల్దార్‌ ఆఫీసులకే జనం పరుగు


హైదరాబాద్‌: మల్లారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ.. 1,500 జనాభా ఉంటుంది.. ఊరికి వీఆర్‌వో ఉన్నారు.. అయితే ఆయనకు ఆఫీసు మాత్రం లేదు.. చేసేది లేక ఆ అధికారే నెలకు రూ.500 చొప్పున ఊళ్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆఫీసు నడుపుతున్నారు! కార్యాలయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అటు గ్రామస్తులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!!.. ఇది ఒక్క మల్లారంలో పరిస్థితే కాదు.. రాష్ట్రంలో చాలా గ్రామాల వీఆర్వోలు ఇవే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు లేక ఇంటిని అద్దెకు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నవారు కొందరైతే.. చెట్టు కింద, పాడుబడ్డ భవనాల్లో, మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో పనులు చేస్తున్నవారు మరికొందరు. ఆఫీసులు లేకపోవడంతో గ్రామంలోని భూములకు సంబంధించిన కీలక రికార్డులను భద్రపర్చడం కూడా కష్టమవుతోందని వీఆర్వోలు గోడు వెల్లబోసుకుంటున్నారు.

పట్టించుకునేవారేరి..?
కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టకపోవడంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థకు నిలువ నీడ లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్రంలోని 6,873 వీఆర్వోలు, 22,245 మంది వీఆర్‌ఏలు గ్రామంలో ఏదో ఒక పంచన కూర్చుని పనులు చక్కబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక వీఆర్వోకు అదనంగా ఐదారు గ్రామాల బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించడంతో కొన్ని సందర్భాల్లో ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం సాధ్యం కావడం లేదు. మండల తహశీల్దార్‌ కార్యాలయంలో కూర్చొని అన్ని గ్రామాల ప్రజలను అక్కడికే పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇక గ్రామంలోని భూములకు సంబంధించిన రికార్డులకూ రక్షణ కరువవుతోంది.

దీంతో వాటన్నింటినీ మండల కేంద్రంలో భద్రపరచుకోవాల్సి వస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) కార్యాలయం నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ భవనాలను వీఆర్‌వో కార్యాలయాలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అయినా క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లవుతున్నా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రయత్నం ప్రారంభించలేదు.

మండల కార్యాలయాలకే పరిమితం
గ్రామాల్లో ఉండాల్సిన గ్రామ రెవెన్యూ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయానికే పరిమితవుతున్నారు. తహశీల్దారు కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడం, పనిభారం అధికంగా ఉండడంతో.. కాస్తోకూస్తో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వీఆర్వోలతోనే తహశీల్దార్లు పనులను చేయించుకుంటున్నారు. రెవెన్యూ సేవలన్నింటినీ ప్రభుత్వం కంప్యూటరైజ్‌ చేయడం, వెబ్‌ల్యాండ్‌ డేటాను ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ అప్‌డేట్‌ చేయాల్సి ఉండటంతో చాలామంది తహశీల్దార్లు ఆ పనులను వీఆర్‌వోలకు అప్పగిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ఆన్‌లైన్‌ ద్వారానే సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున తహశీల్దార్‌ కార్యాలయంలో ఉండాల్సి వస్తోందని వీఆర్వోలు చెబుతున్నారు. వీఆర్‌ఏల మాదిరే వీఆర్వోలను కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తిని నియమిస్తే మేలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

గ్రామంలోనే రెవెన్యూ కార్యాలయం ఉంటే..
– గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రజలు చిన్నచిన్న అవసరాలకు మండల కేంద్రానికి వెళ్లే పని తప్పుతుంది
– కార్యాలయం లేక, వీఆర్వో గ్రామానికి రాక ప్రతి పనికీ మండలాఫీసుకు వెళ్లి రావడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉన్న ఊళ్లోనే ఆఫీసు ఉంటే ప్రజలకు ప్రయాణ ఖర్చులు తప్పడంతోపాటు విలువైన సమయం వృథా కాకుండా ఉంటుంది
– క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిని పూర్తవుతుంది. రైతులకు అవసరమైన పహానీ నకళ్లను అక్కడిక్కడే వీఆర్వో జారీ చేస్తారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు వీఆర్వో సిఫార్సు ఉంటేనే మండల తహశీల్దారు జారీ చేస్తారు
– గ్రామంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సాయం కోసం వీఆర్వోనే ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయడం సులభతరం అవుతుంది
– చెరువులు, భూములు, నాలాల రక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ సులువవుతుంది

ఆఫీసులు ఉంటే సేవలు మరింత చేరువ
ప్రతి గ్రామానికి రెవెన్యూ కార్యాలయం ఉంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుంది. అధికారి అందుబాటులో ఉంటే ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువవుతాయి. వివిధ పథకాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలించేందుకు వీలవుతుంది. రెవెన్యూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యాలయం ఉండాలని గత ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో చాలా గ్రామాల్లో వీఆర్వోలు ఇల్లు అద్దెకు తీసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తమ జేబు నుంచే అద్దె చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు నిర్మించాలి.
                                                 – బాణాల రామిరెడ్డి, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement