మేడారంలో మండమెలిగె పండుగలో తోరణం కడుతున్న పూజారులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర ఘట్టానికి మండమెలిగె పండుగతో తొలి అడుగు పడింది. జాతరకు వారం రోజుల ముందు బుధవారం మండమెలిగె పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క ప్రధాన పూజా రి సిద్ధబోయిన మునీందర్ ఇంటినుంచి అచారం ప్రకారం పసుపు, కుంకుమ పూజాసామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. మరో పూజారి లక్ష్మణ్‌రావు ఇంటి నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. ఆలయాన్ని శుద్ధి చేశారు.
అనంతరం పూజారులు మేడారం గ్రామ శివారులోని మైసమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడినుంచి బొడ్రాయి వద్దకు వెళ్లి పవిత్రజలంతో శుద్ధి చేశారు. సమ్మక్క గుడి ముందు ఆడపడచులు ముగ్గు లు వేసి అలకరించారు. మామిడి తోరణాలకు ఉల్లిగడ్డ, కోడిపిల్లలను కట్టి (దిష్టి తగలకుండా) దొర స్తంభాన్ని నిలిపారు. కల్లు (సాక), నీళ్లు, పాలు, బెల్లం పానకం, నెయ్యి, చలి గంజితో రోడ్డుకు అడ్డంగా ఆరగింపు చేశారు. అనంతరం గ్రామ శివారులో మరో దొర స్తంభాన్ని నిలిపారు.
ప్రధాన పూజారి (వడ్డె) కొక్కరి కృష్ణయ్య పసుపు, కుంకుమలతో అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్లారు. బు«ధవారం రాత్రి అక్కడే జాగారం చేసి గురువారం గుడి చేరుకోనున్నారు. అదేసమయంలో కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో కాక వంశస్తుల ఆధ్వర్యంలో మండమెలిగె పండుగ, పోను గొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో గుడిమెలిగె కార్యక్రమాన్ని నిర్వహించారు. మండమెలిగె పండుగ సందర్భంగా మేడారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment