ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీని 30 శాతం పెంచాం
కేసీఆర్ కిట్‌లో భారీ కుంభకోణం జరిగింది
మీడియాతో చిట్‌చాట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు.
మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్‌్కఫోర్స్‌లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు.
ఇందుకు ఓ టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్‌పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్‌ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్‌్కఫోర్స్‌లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు.
ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం
ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు.
ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్‌ఆర్‌ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు.
65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్‌మెంట్
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు.
అడిషనల్ డీఎంఈల రిటైర్‌మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు.
కార్పొరేషన్‌తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు
బీఆర్‌ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్‌లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు.
ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు.
డీహెచ్ పనితీరుపై అసంతృప్తి
ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు.
యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...
రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్‌లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్‌మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment