సాక్షి, హైదరాబాద్: ఇది దాదాపు మూడు వేల ఏళ్లనాటి మెన్హిర్. అంటే ఆదిమ మానవుల సమూహంలో కాస్త ముఖ్యమైన వ్యక్తులుగా భావించే వారి సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి. అలాంటి రెండు అరుదైన మెన్హిర్‌లు యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామ శివారులో వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, గోపాల్ వీటిని గుర్తించారు. అందులో ఒకటి కొంత విరిగి నేలపైకి ఒరిగిపోగా, 4–5 అడుగుల వెడల్పు, 15–16 అడుగుల ఎత్తు ఉన్న మరో మెన్హిర్ నిలిచే ఉందని పరిశోధకులు చెప్పారు.
గతంలో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సమాధులు ఉండేవని, వాటికి చెందిన పెద్దపెద్ద రాతి గుండ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం తరలించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని కాపాడి చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment